Share News

రైతన్నకు ఊరటేదీ?

ABN , Publish Date - Oct 08 , 2026 | 02:42 AM

జిల్లాలో కష్టాల్లో ఉన్న రైతులకు ఊరట లభించడం లేదు. ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలు లేక, పంటలు సాగు కాక జిల్లావ్యాప్తంగా కరువు నెలకొంది. 18 మండలాల్లో తీవ్రంగా, 10 మండలాల్లో మధ్యస్థాయిలో కరువు నెలకొన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అది వెలువడి పక్షం దాటినా రైతులకు ఊరట కలిగించే చర్యలు మాత్రం కనిపించడం లేదు.

రైతన్నకు ఊరటేదీ?
ఒంగోలు సమీపంలో దున్ని పైర్లు వేయకుండా వదిలేసిన భూమి (ఇన్‌సెట్‌లో) గతేడాది భారీ వర్షాలకు దెబ్బతిన్న పొగాకు తోట (ఫైల్‌)

జిల్లాలో 18 మండలాల్లో తీవ్ర, పది చోట్ల మధ్యస్థ కరువు ప్రకటన

తదనంతర చర్యలు శూన్యం 8 విపత్తుల పరిహారం అందని వైనం

రెండేళ్లలో అతివృష్టి, ఆపై అనావృష్టితో 68వేల మంది రైతులకు నష్టం

జిల్లాలో కష్టాల్లో ఉన్న రైతులకు ఊరట లభించడం లేదు. ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలు లేక, పంటలు సాగు కాక జిల్లావ్యాప్తంగా కరువు నెలకొంది. 18 మండలాల్లో తీవ్రంగా, 10 మండలాల్లో మధ్యస్థాయిలో కరువు నెలకొన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అది వెలువడి పక్షం దాటినా రైతులకు ఊరట కలిగించే చర్యలు మాత్రం కనిపించడం లేదు. గత రెండేళ్లలో ఇదేతరహాలో పలుమార్లు అతివృష్టి, అనావృష్టితో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే వారికి ప్రభుత్వం నుంచి విపత్తుల సహాయం కింద అందాల్సినవి ఒక్క రూపాయి కూడా ఇంతవరకూ దక్కలేదు. దీంతో ప్రస్తుతం కూడా ఏమీ అందదేమోనన్న ఆందోళన కర్షకుల్లో వ్యక్తమవుతోంది.

ఒంగోలు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : సాధారణంగా కరువు, భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంటలు సాగు కాక, సాగైనవి దెబ్బతిని దిగుబడులు రావు. కొన్ని సందర్భాల్లో చేతికి వచ్చే దశలో ఉన్న పైర్లు నీటిపాలవుతాయి. అలాంటి సమయాల్లో ప్రభుత్వం తక్షణం నష్టపోయిన పంటలు, రైతులను గుర్తించి వారికి ప్రకృతి వైపరీత్యాల నిబంధనల ప్రకారం నష్టపరిహారాన్ని అందిస్తుంది. వాస్తవంగా రైతులు నష్టపోయిన మొత్తాలతో పోల్చితే అది చాలా తక్కువే అయినప్పటికీ సకాలంలో అందజేస్తే ఎంతో కొంత ఊరట చెందుతారు. ఏడాదిలో ఖరీఫ్‌ సీజన్‌లో ఇలాంటి నష్టం సంభవిస్తే తక్షణం ప్రభుత్వం స్పందించి తీసుకునే చర్యలు రబీ సాగుకు రైతులకు ఎంతో కొంత మేలు చేస్తాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా కరువు నెలకొంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడలేదు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ సాధారణ సాగు విస్తీర్ణం 55,774 హెక్టార్లు కాగా కేవలం 33శాతంలో మాత్రమే పంటలు సాగయ్యాయి. అందులో సగంపైన ఎండిపోయాయి. అలా పంటలు సాగుకాక, సాగైన పంటలు ఎండిపోయి దిగుబడులు వచ్చే పరిస్థితి లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ప్రకటన సరే తదుపరి చర్యలేవీ?

గత నెలాఖరులోనే జిల్లా మొత్తం కరువుగా ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం రైతులకు మేలు చేసే చర్యలు మాత్రం ప్రారంభించలేదు. సాధారణంగా కరువు ప్రకటన తర్వాత రైతు వారీ, పంటల వారీ నష్టాలను వ్యవసాయ, రెవెన్యూ, ఇతర సంబంధిత శాఖల ద్వారా ఎన్యుమరేషన్‌ చేస్తారు. తదనుగుణంగా గెజిట్‌ ప్రకటిస్తారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే ్టపరిహారం అందించడంతోపాటు రుణాల రీషెడ్యూల్‌, తదుపరి పంటల సాగుకు సబ్సిడీపై విత్తనాల సరఫరా, అవసరమైన ప్రాంతాల్లో పశుగ్రాసం, తాగునీటి సరరాకు తగు చర్యలు తీసుకుంటారు. అయితే ఈసారి కరువు మండలాల ప్రకటన వచ్చిందే తప్ప తదుపరి చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. నిజానికి ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో తీవ్రంగా లోటు వర్షపాతం నమోదైంది. సీజన్‌ మొత్తంలో 394.10 మి.మీ, సాధారణ వర్షపాతానికి 164.50 మి.మీ నమోదైంది. అలా సుమారు 56,70శాతం లోటు వర్షపాతం ఉండగా కురిసిన 164.50 మి.మీలలో దాదాపు 80.0 మి.మీ సెప్టెంబరు మూడో వారంలో పడింది.

రబీకి అనుకూలించిన వాన

జిల్లాలోని పలు మండలాల్లో సెప్టెంబరు చివర్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షమే కురిసింది. ఆ వర్షాలు ఖరీఫ్‌ సాగుకు అంతగా ఉపకరించకపోయినా ఈనెల నుంచి ఆరంభమైన రబీ సీజన్‌ పంటల సాగుపై రైతుల్లో ఆశలను చిగురింపజేశాయి. చాలాప్రాంతాల్లో ఖరీఫ్‌ సీజన్‌లో పంటలు సాగు చేయలేకపోయిన రైతులు రబీ సాగుకు ఉపక్రమించారు. ఇలాంటి సమయంలో ఖరీఫ్‌లో నెలకొన్న కరువుతో నష్టపోయిన వారికి ఉపశమనం కలిగించే చర్యలు చేపడితే తక్షణం రబీ సాగుకు ఉపకరించేది. కాగా అలాంటి ప్రయత్నం జిల్లాలో కనిపించడం లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ కరువు ఉపశమన చర్యలే కాక గత రెండేళ్లకుపైన వివిధ సందర్భాలలో అతివృష్టి, అనావృష్టి బారిన పడిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఇంతవరకూ అందిన దాఖలాలు లేవు. ఉమ్మడి జిల్లాలో గత రెండేళ్లలో రెండు రబీ సీజన్లు వర్షాలు సరిలేక రైతులు నష్టపోయారు. అలాగే కొన్ని సమయాల్లో అధిక వర్షాలు నష్టపరిచాయి. గత ఏడాది అక్టోబరులో సంభవించిన మొంథా తుఫాన్‌ తీవ్రంగా దెబ్బతీసింది. అలా వివిధ సందర్భాలల్లో ప్రకృతి వైపరీత్యాలతో 68,006 మంది రైతులకు చెందిన సుమారు 66,744 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. రైతువారీ, పంట వారీ నష్టాలను గుర్తించారు.

ఇంతవరకూ అందని పరిహారం

సాధారణ పెట్టుబడులు, కోల్పోయిన రాబడులు చూస్తే వందల కోట్లలోనే రైతులకు నష్టం జరిగింది. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సుమారు రూ.80.40 కోట్ల మేర పరిహారం అందించాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అయితే ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా వారికి అందలేదు. ఇక ఈ ఏడాది ఖరీఫ్‌ కరువు నుంచి తెరుకొని రబీకి సిద్ధమవుతున్న రైతులు పెట్టుబడులకు ఇక్కట్లు పడుతున్నారు. గతం కన్నా ప్రస్తుతం పొగాకు మార్కెట్‌ తీవ్ర ప్రతికూలంగా సాగుతోంది. రెండేళ్ల నుంచి శనగలకు ధరలు లేక నిల్వలు పేరుకుపోయాయి. ఖరీఫ్‌లో పంటలు సాగుకు కాక వాటి ద్వారా రావాల్సిన డబ్బు రాకపోవడంతో ప్రస్తుత రబీ సాగుకు అవస్థలు పడుతున్నారు. తక్షణం ప్రభుత్వం కరువు సహాయక చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Updated Date - Oct 08 , 2026 | 02:42 AM