Share News

ప్రజల చెంతకు వైద్య సేవలు

ABN , Publish Date - Oct 08 , 2026 | 02:40 AM

రాష్ట్రంలో వైద్య సేవ లను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో జిల్లా వైద్యశాఖ చర్యలు చేపట్టింది. ఈ-సంజీవని టెలీమెడిసిన్‌ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించారు.

ప్రజల చెంతకు వైద్య సేవలు

జనవరి 1 నుంచి ఈ-సంజీవని అమలు

ముందస్తుగా వైద్యశాలల్లో ఏర్పాట్లకు అధికారులకు ప్రభుత్వ ఆదేశం

62 పీహెచ్‌సీల్లో సేవలు అనుసంధానం

19 కేంద్రాల్లో ప్రత్యేకంగా రూంలు ఏర్పాటు

ఒంగోలు కలెక్టరేట్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో వైద్య సేవ లను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో జిల్లా వైద్యశాఖ చర్యలు చేపట్టింది. ఈ-సంజీవని టెలీమెడిసిన్‌ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించారు. జిల్లాలో 62 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా వాటి ద్వారా ప్రజలకు డిజిటలైజేషన్‌ విధానంలో పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో వైద్యసేవలు అందించనున్నారు. జిల్లాలో 19 పీహెచ్‌సీల్లో ఈ సంజీవని వైద్యసేవలను అందించేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. మిగిలిన అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవ లను అనుసంఽధానం చేయనున్నారు. వైద్యశాలల్లో అవసరమైన ఐటీ పరికరాల ఏర్పాటు, ఇంటర్నెట్‌, పవర్‌ బ్యాకప్‌, సిబ్బంది నియామకం, శిక్షణ, మాక్‌ కన్సల్టేషన్లు, వర్క్‌ ఫ్లో ప్రాక్టీస్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ- సంజీవని కార్యక్రమం ద్వారా గర్భిణులు, ప్రసూతి సేవలు, నవజాత శిశువులు, బాలలు, కౌమారదశ ఆరోగ్యం, సంక్రమణ వ్యాధుల నియంత్రణ, కంటి, చెవి, ముక్కు, గొంతు, నోటి ఆరోగ్య సేవలు, వృద్ధులు, ప్యాలియేటివ్‌ కేర్‌, అత్యవసర వైద్యం, మానసిక ఆరోగ్య సేవలను అందించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రోగుల నమోదు, అపాయింట్‌మెంట్లు, డిజిటల్‌ ఆరోగ్య రికార్డులు, వైద్య పరీక్షలు, మందుల పంపిణీ, నిపుణుల వైద్య సలహాలు, రిఫరల్స్‌, తదుపరి చికిత్స పర్యవేక్షణను సమన్వయం చేయనున్నారు. గర్భిణులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, వృద్ధులతోపాటు వివిధ ఆరోగ్య అవసరాలు ఉన్న ప్రజలకు వైద్య సేవలను ప్రభుత్వం మరింత సులభతరం చేయనుంది. జనవరి 1వ తేదీ నుంచి ఈసంజీవిని కార్యక్రమాన్ని ప్రారంభిస్తుడటంతో ఈలోపు ఆయా వైద్యశాలల్లో అవసరమైన సదుపాయాల కల్పనకు అవకాశం కల్పించింది. ఈ వైద్యసేవలను కార్పొరేట్‌ వైద్యశాలల తరహాలోనే అందించనున్నారు. అందుకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి పర్యవేక్షణలో నోడల్‌ అధికారుల నియామకంతో పాటు ఈ సంజీవిని కింద వైద్యసేవలను అందించేందుకు నియమించే వైద్యులు, సిబ్బందికి అవసరమైన శిక్షణ కూడా ఇవ్వనున్నారు.

సమర్థవంతంగా అమలుకు చర్యలు

డాక్టర్‌ టి.వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో

జిల్లాలో ఈ-సంజీవని వైద్యసేవలను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాం. ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను అనుగుణంగా అన్ని వైద్యశాలల్లో సిబ్బంది నియామకంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే క్షేత్రస్ధాయిలో దిశానిర్దేశం చేయడంతోపాటు ఈ సంజీవని సేవల కోసం నియమించే సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తాం.

Updated Date - Oct 08 , 2026 | 02:40 AM