Share News

యుద్ధనౌకల రహస్యాలు అమ్మకం

ABN , Publish Date - Oct 18 , 2026 | 03:42 AM

దేశానికి చెందిన యుద్ధ నౌకలు, జలాంతర్గాముల కదలికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని రూ.16 వేలకు అమ్మేసిన వ్యక్తిని శనివారం విశాఖపోలీసులు అరెస్టు చేశారు.

యుద్ధనౌకల రహస్యాలు అమ్మకం

  • డాక్‌యార్డు కాంట్రాక్ట్‌ డ్రైవర్‌ నిర్వాకం

  • నిందితుడిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు

మల్కాపురం (విశాఖపట్నం), అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): దేశానికి చెందిన యుద్ధ నౌకలు, జలాంతర్గాముల కదలికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని రూ.16 వేలకు అమ్మేసిన వ్యక్తిని శనివారం విశాఖపోలీసులు అరెస్టు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరికి చెందిన కిల్లో సురేశ్‌ కుమార్‌ విశాఖ నేవల్‌ డాక్‌యార్డులోని మెరైన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కంపెనీలో కాంట్రాక్టు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈజ్‌ ప్రీత్‌(25) అనే యూజర్‌ ఐడీ ద్వారా గుర్తుతెలియని వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ నేపథ్యంలో యుద్ధ నౌకలు, జలాంతర్గాముల కదలికల రహస్య సమాచారాన్ని ఈజ్‌ ప్రీత్‌కు సురేశ్‌కుమార్‌ వాట్సాప్‌ ద్వారా పంపించాడు. దీని ద్వారా రూ.16 వేల ఆర్థిక ప్రయోజనం పొందాడు.

అలాగే బిహార్‌కు చెందిన వరుణ్‌కుమార్‌, విశాఖకు చెందిన మహ్మద్‌ సాను అనే తన సన్నిహితుల మొబైల్‌ ఫోన్‌ల ద్వారా కూడా ఈజ్‌ ప్రీత్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందించేవాడు. అంతేకాకుండా అతనితో సంభాషిస్తుండేవాడు. దీనికి సంబంధించి నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో నిందితుడిని విశాఖలోని మల్కాపురం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరసింహరావు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు

దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ

Updated Date - Oct 18 , 2026 | 03:42 AM