పారిశ్రామిక ప్రగతికి కొత్త దిశ
ABN , Publish Date - Nov 10 , 2026 | 03:43 AM
రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి కొత్త దశ దిశ ఇచ్చేలా రెండు రోజుల పాటు విశాఖ సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈనెల 12, 13 తేదీల్లో విశాఖలో నిర్వహించే 31వ సదస్సుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
12, 13 తేదీల్లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు
నేవిగేటింగ్ న్యూవరల్డ్ థీమ్‌తో నిర్వహణ
58 దేశాల ప్రభుత్వ, పారిశ్రామికవేత్తలు హాజరు
ముఖ్య అతిథులుగా ఉపరాష్ట్రపతి, అమిత్‌షా, ఇతర మంత్రులు
సదస్సులో ప్రత్యేకాంశంగా నదుల అనుసంధానం
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి కొత్త దశ దిశ ఇచ్చేలా రెండు రోజుల పాటు విశాఖ సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈనెల 12, 13 తేదీల్లో విశాఖలో నిర్వహించే 31వ సదస్సుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నేవిగేటింగ్ న్యూవరల్డ్ థీమ్‌తో నిర్వహించే సదస్సులో ప్రపంచ స్థాయి పారిశ్రామిక దిగ్గజ సంస్థ యాజమాన్యాలు పాల్గొంటాయి. 58 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు.
15 దేశాలకు చెందిన మంత్రులు, 40 మంది అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు, వివిధ దేశాల రాయబారులు ఈ సమ్మిట్‌కు వస్తారు. సింగపూర్, నేపాల్, కాంబోడియా, మయన్మార్, యూఏఈ, కెనడా, స్లోవాక్ రిపబ్లిక్, మారిషస్, ఈజిప్ట్, మొజాంబిక్ తదితర దేశాలకు చెందిన పారిశ్రామిక యాజమాన్య సంస్థల ప్రతినిధులు విశాఖ రానున్నారు. ఈ సదస్సులో 400కు పైగా బిజినెస్ టు బిజినెస్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నదుల అనుసంధానం కార్యక్రమాన్ని గురించి ప్రత్యేకంగా చర్చిస్తారు.
రాష్ట్రంలో వాణిజ్య, పారిశ్రామిక పెట్టుబడులే కాకుండా రాష్ట్ర విభజన తర్వాత ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్‌లో పెట్టుబడులపైనా ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పెట్టుబడిదారుల్లో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పేలా ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పారిశ్రామిక ప్రోత్సహకాలు గురించి సదస్సులో ప్రత్యేకంగా వివరించనున్నారు.
గ్లోబల్ స్థాయిలో ఆర్థిక, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులు.. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైనా ఈ సదస్సులో చర్చిస్తారు. ఇక ఈ సదస్సుకు సన్నాహకంగా ఇప్పటికే రాష్ట్రంలో నిర్వహించిన ఆరు ప్రాంతీయ సదస్సుల్లో రూ. 86,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించారు. ఇక 1995 నుంచి ఏటా సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు జరుగుతోంది.
11న ముందస్తు సమాలోచనలు
పెట్టుబడుల సదస్సులో భాగంగా బుధవారం పారిశ్రామిక పత్రినిధుల ముందస్తు సమాలోచనలు జరగనున్నాయి. ఆ రోజు రాత్రికే ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ సదస్సు ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఏపీ ఉమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్ కూడా సమాంతరంగా నిర్వహించనున్నారు.
12వ తేదీ ఉదయం 9 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, ప్రహ్లాద్‌జోషి, రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి లోకేశ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధి రాబర్టో తదితరులు హాజరవుతారు. 13వ తేదీన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు.
సాయంత్రం నాలుగు గంటలకు సీఐఐ సదస్సు ముగుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 272 ప్రాజెక్టులు రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి. మరో రూ. 17 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. 2025-26లో దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 25.6 శాతం రాష్ట్రం దక్కించుకుంది.
ఈ వార్తలనూ చదవండి: