Share News

పట్టుబడిన సొత్తుతో రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ పరార్‌!

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:45 AM

వివిధ కేసుల్లో పట్టుబడిన బంగారం, నగదుతో రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ పరారయ్యాడు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఈ వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపుతోంది.

పట్టుబడిన సొత్తుతో రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ పరార్‌!

  • 165 గ్రాముల బంగారం.. రూ.15 లక్షలు స్వాహా

  • అధికారుల గోప్యత.. విజయవాడ స్టేషన్‌లో కలకలం

విజయవాడ, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): వివిధ కేసుల్లో పట్టుబడిన బంగారం, నగదుతో రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ పరారయ్యాడు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఈ వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపుతోంది. విషయం బయటకు పొక్కితే తమ మెడకు చుట్టుకుంటుందనే భయంతో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఉంచుతున్నారు. విజయవాడ రైల్వే పోలీసుస్టేషన్‌లో పనిచేసే హెడ్‌కానిస్టేబుల్‌ పై అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా కొద్దిరోజులుగా విధులకు రావట్లేదు. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నాడు. ఏం జరిగిందని ఆరా తీయగా స్టేషన్‌లో భద్రంగా ఉండాల్సిన వివిధ నేరాలకు సంబంధించిన భద్రంగా ఉండాల్సిన రూ.15 లక్షలు, 165 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించడం లేదని తెలిసింది.

సాధారణంగా రైల్వే పోలీసుస్టేషన్‌కు హెడ్‌కానిస్టేబుల్‌ రైటర్‌గా వ్యవహరిస్తారు. చోరీ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సొత్తుకు ఆయనే కస్టోడియన్‌గా ఉంటారు. డైరీలో రాసిన ఆ సొత్తు గురించి పై అధికారి కొద్దిరోజులుగా రైటర్‌ను అడుగుతున్నారు. వాటిని చూపించమని అడిగినప్పుడల్లా ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటున్నాడు. మాయమైన బంగారమంతా 24 క్యారెట్స్‌ అని తెలిసింది. సొత్తు కనిపించకపోవడంతో అధికారులు రైటర్‌ను నిలదీసినట్టు సమాచారం. 24 క్యారెట్స్‌ బంగారం మాయమైతే తక్కువ రకం బంగారం 80 గ్రాములు అతనితో కొనిపించినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత నుంచి ఆయన పత్తా లేకుండాపోయారు. దీనిపై అధికారులను ప్రశ్నించగా, అటువంటిదేమీ లేదని కొట్టేపారేస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు

Updated Date - Nov 12 , 2026 | 05:49 AM