డూప్లికేట్ టికెట్లతో గోల్‌మాల్!
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:11 AM
బెజవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో టికెట్ల గోల్‌మాల్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు శనివారం చేసిన విచారణలో తీగ లాగితే డొంకంతా కదిలింది.
బెజవాడ దుర్గ గుడి టికెట్ కౌంటర్‌లో మాయ
కెమెరా జాక్ పీకేసి.. ప్రింటర్ సెట్టింగ్స్ మార్చేసి
(ఆంధ్రజ్యోతి-విజయవాడ): బెజవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో టికెట్ల గోల్‌మాల్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు శనివారం చేసిన విచారణలో తీగ లాగితే డొంకంతా కదిలింది. ఓ ఉద్యోగి దర్శనానికి వచ్చే భక్తులకు డూప్లికేట్ టికెట్లు జారీ చేసి.. డబ్బులు కొట్టేస్తున్న వ్యవహారం బయటపడింది.
ఇందుకు టికెట్ కౌంటర్‌లో కంప్యూటర్ వద్ద ఉండే ప్రింటర్‌లో సెట్టింగ్‌లు మార్చేసినట్లు అధికారులు గుర్తించారు. కౌంటర్‌లో ఉండే సీసీ కెమెరాకు అడ్డుగా ఉండి, దాని జాక్‌ను తొలగించిన తర్వాత భక్తుల నుంచి డబ్బులు తీసుకుని డూప్లికేట్ టికెట్లను జారీ చేస్తునట్లు తేల్చారు. మూడు రోజుల క్రితం గుర్తించిన ఈ వ్యవహారానికి సంబంధించి వి.చంద్రమౌళి అనే ఎన్‌ఎంఆర్ ఉద్యోగిని ఆలయ అధికారులు ఇప్పటికే విధుల నుంచి తొలగించారు.
ముందు ఇచ్చిన అదే సీరియల్ నంబర్‌తో
చంద్రమౌళి ఇంటర్ వరకు చదువుకున్నాడు. కౌంటర్‌లో టికెట్ల జారీలో ఎలాంటి మాయ చేయవచ్చన్న టెక్నిక్‌ను తెలుసుకున్నాడు. దీని గురించి టెక్నికల్ విభాగానికి కూడా తెలియకపోవడం గమనార్హం. దర్శనం, ఆర్జితసేవ, ప్రసాదం టికెట్లు విక్రయించే కౌంటర్లలో కంప్యూటర్లతోపాటు ప్రింటర్లు ఉంటాయి. ప్రతి కౌంటర్‌లోనూ సీసీ కెమెరా ఉంటుంది. ఈ కెమెరాలన్నీ ఈవో చాంబర్, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్న వీడియోవాల్‌కు అనుసంధానమై ఉంటాయి. టికెట్ల విక్రయాలకు సంబంధించి దేవస్థానం కొన్నాళ్ల క్రితం ప్రత్యేకంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయించింది.
కొండపై ఓం మలుపు వద్ద నుంచి ప్రారంభమయ్యే క్యూలకు ముందు భాగంలో టికెట్ విక్రయాల కౌంటర్ ఉంది. ఇక్కడ రూ.500, రూ.300, రూ.100 టికెట్లను విక్రయిస్తారు. ఇందులో పనిచేసే చంద్రమౌళి కంప్యూటర్‌కు అనుసంధానంగా ఉంటే ప్రింటర్‌లో సెట్టింగ్స్‌ను మార్చేశాడు. భక్తుల నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత కంప్యూటర్‌లో ప్రింట్ ఆప్షన్‌పై క్లిక్ చేయగానే టికెట్ వస్తుంది. ఈ ప్రింటర్ సెట్టింగ్‌ను చంద్రమౌళి కంప్యూటర్‌లో మార్చు చేశాడని అధికారుల అంతర్గత విచారణలో తేలింది.
ఒక భక్తుడు రూ.500 టికెట్ తీసుకుంటే దానికి ఒక సీరియల్ నంబరుతో ప్రింట్ వస్తుంది. తర్వాత వచ్చిన భక్తుడికి ఇదే సీరియల్ నంబరుతో డూప్లికేట్ టికెట్ ప్రింట్ వచ్చేలా సెట్టింగ్స్ మార్చాడు. ముందుగా ఇచ్చిన టికెట్ డబ్బులు దేస్థానానికి ఇచ్చి, తర్వాత ఇచ్చిన టికెట్ డబ్బులను చంద్రమౌళి జేబులో వేసుకునేవాడని అధికారులు నిర్ధారించారు. డూప్లికేట్ టికెట్లు జారీ చేసేటప్పుడు చంద్రమౌళి సీసీ కెమెరాకు అడ్డుగా కూర్చునేవాడు. తర్వాత చేయి పైకి లేపి దాని జాక్‌ను తొలగించేవాడు. ఇలా చేయడం ద్వారా ఆ సీసీ కెమెరా ఈవో చాంబర్‌లోని వీడియోవాల్‌పై కనిపించదు.
ఈ వార్తలనూ చదవండి:
బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?
కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి