Share News

పరివర్తన రాజనీతి!

ABN , Publish Date - Nov 12 , 2026 | 02:14 AM

వైఎస్‌ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉండి... వైఎస్‌ జగన్‌తో విభేదించి వైసీపీ నుంచి బయటికి వచ్చేసిన విజయసాయిరెడ్డి సొంత రాజకీయ పార్టీని స్థాపించారు.

పరివర్తన రాజనీతి!

  • కొత్త పార్టీని ఆవిష్కరించిన సాయిరెడ్డి

  • కాషాయం, తెలుపు, ధర్మచక్రంతో జెండా

  • 11-11-11-11 ముహూర్తంలో కొత్త ప్రస్థానం

  • అన్ని స్థానాల్లో పోటీచేస్తామని ప్రకటన

  • చంద్రబాబు, జగన్‌కు చురకలు

అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): వైఎస్‌ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉండి... వైఎస్‌ జగన్‌తో విభేదించి వైసీపీ నుంచి బయటికి వచ్చేసిన విజయసాయిరెడ్డి సొంత రాజకీయ పార్టీని స్థాపించారు. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరుతో ప్రజల్లోకి వెళుతున్నట్లు ప్రకటించారు. పైన కాషాయం, కింద తెలుపు రంగు.. మధ్యలో ధర్మచక్రం ముద్రతో కూడిన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. బుధవారం విజయవాడలోని ఒక కన్వెన్షన్‌ సెంటర్‌లో... సన్నిహితులు, అభిమానుల నడుమ విజయసాయిరెడ్డి తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. 11వ నెల, 11వ తేదీ ఉదయం 11 గంటలా 11 నిమిషాలకు ఈ ప్రకటన చేయడం విశేషం. ఆ తర్వాత పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ సాయిరెడ్డి ప్రసంగించారు.

‘రాష్ట్రంలోని ఐదు కోట్ల మందిని ఆ రెండు పార్టీలే శాసించాలా? ముఖ్యమంత్రి వారసులే మళ్లీ ముఖ్యమంత్రులు కావాలా? ఆ అహంకారపు కుటుంబాల నాయకత్వం వద్దేవద్దు’ అని అన్నారు. తనకు పదవులు వారసత్వంగా రాలేదని.. స్వయంకృషితో సాధించుకున్నవేనని చెప్పారు. వైసీపీ ఎదుగుదల కోసం కష్టపడ్డ తనకు అవమానాలే దక్కాయని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజల మధ్య ఉండాలని.. కోటల్లాంటి ఇళ్లలో కాదని పరోక్షంగా జగన్‌కు చురకలు అంటించారు. ‘‘2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలతో వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు అద్భుత విజయం అందించారు. 2024లో 11 స్థానాలకే పరిమితం చేశారు. ప్రజలు సంక్షేమం వద్దనుకోలేదు... జగన్‌ అహంకారాన్ని వద్దనుకున్నారు’’ అని తెలిపారు. ప్రశ్నలను సహించని జగన్‌ రాజకీయ సంస్కృతిని వారు తిరస్కరించారని వ్యాఖ్యానించారు. వైసీపీ కార్యకర్తలు కుటుంబాలను పక్కన పెట్టి వారి చెమటతో పార్టీని బలోపేతం చేశారని.. కానీ వారికి జగన్‌ గౌరవం ఎక్కడిచ్చారని ప్రశ్నించారు. కార్యకర్తలకు గౌరవం దక్కాలన్నా, ప్రజా సేవ చేయాలన్నా పరివర్తన రాజనీతి పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని ఆహ్వానం పలికారు.


బాబు బదులివ్వాలి...

చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మారని.. ఇప్పుడు వారడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని సాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. రౌడీయిజం, గూండాయిజం, మందుబలం, మంద బలం, ధన బలమే తమ బలమని కూటమి ప్రభుత్వం నమ్మితే ప్రజలు సహించరని హెచ్చరించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని.. రైతులు, విద్యార్ధులు, నిరుద్యోగులు, యువతకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.


ఆ పేరుతో ఇప్పటికే పార్టీ...

విజయ సాయిరెడ్డి ఏర్పాటు చేసిన పార్టీ పేరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే... పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) పేరు ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ వద్ద రిజిస్టరై ఉంది. అంతేకాదు... తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని కొన్ని స్థానాల్లో ఈ పార్టీ అభ్యర్థులు పోటీ కూడా చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం... ఒకే పేరుతో రెండు పార్టీలు ఉండేందుకు వీల్లేదు. సాయిరెడ్డి ఏర్పాటు చేసిన పార్టీపై ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద రిజిస్టరైన పరివర్తన్‌ రాజనీతి పార్టీ ప్రతినిధులు ఎలా స్పందిస్తారో చూడాలి! సాయిరెడ్డి కొత్త పార్టీ గతంలో నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ‘పీఆర్పీ’ (ప్రజారాజ్యం పార్టీ)ని గుర్తుకు తెచ్చేలా ఉండటం మరో విశేషం.

పాత పార్టీకి కొత్త జెండా: నవతరం పార్టీ

(చిలకలూరిపేట-ఆంధ్రజ్యోతి): పరివర్తన రాజనీతి పార్టీ 2023లోనే ఎన్నికల సంఘం వద్ద నమోదైందని నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. పాత పార్టీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా స్థాపించినట్లు, కొత్త జెండాను ఆవిష్కరించినట్లు సాయిరెడ్డి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘‘గతంలో వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని శివకుమార్‌ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లే... ఇప్పుడు ముఖేశ్‌ అనే వ్యక్తి నుంచి విజయసాయిరెడ్డి పరివర్తన రాజనీతి పార్టీని కొనుగోలు చేసి ఉండొచ్చు. లేదా... సాయిరెడ్డే ఆ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండవచ్చు’’ అని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు

Updated Date - Nov 12 , 2026 | 02:17 AM