Share News

దశాబ్దాల కలనెరవేరుతోంది!

ABN , Publish Date - Aug 08 , 2026 | 06:56 AM

మార్కాపురం జిల్లాలో కరువు నేలకు సాగుతాగు, సాగునీరందించే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలన్న దశాబ్దాల కల నెరవేరబోతోంది. మరో రెండు వారాల్లో ఈ ప్రాజెక్టు నుంచి నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దశాబ్దాల కలనెరవేరుతోంది!
Veligonda Project

అమరావతి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): మార్కాపురం జిల్లాలో కరువు నేలకు సాగుతాగు, సాగునీరందించే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలన్న దశాబ్దాల కల నెరవేరబోతోంది. మరో రెండు వారాల్లో ఈ ప్రాజెక్టు నుంచి నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తికావస్తున్న నేపథ్యంలో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష జరిపారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ కె.నరసింహమూర్తి, ఇతర ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. నల్లమల సాగర్‌ రిజర్వాయరుకు నీటిని తరలించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. రెండు టన్నెళ్లలో మిగిలిన 286 మీటర్ల లైనింగ్‌ పనులు మరో 10రోజుల్లో పూర్తవుతాయని మంత్రికి అధికారులు తెలిపారు. టన్నెల్‌-2లో చిక్కుకున్న టీబీఎం మెషీన్‌ తొలగింపు వారంలో పూర్తవుతుందన్నారు.


1900 మెట్రిక్‌ టన్నుల ఈ యంత్రం నుంచి ఇప్పటిదాకా 1300 టన్నులను బయటకు తెచ్చామన్నారు. తర్వాత నిమ్మల మీడియాతో మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లూ వెలిగొండ పనులను నిర్లక్ష్యంగా వదిలేదసిందన్నారు. టన్నెల్‌లో చిక్కుకున్న టీబీఎం మెషీన్‌ తొలగింపుపై న్యాయస్థానం నుంచి క్లియరెన్సులు కూడా తీసుకురాలేదని ఆక్షేపించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి.. మార్కాపురం, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీరివ్వడంపై దృష్టి సారించిందన్నారు. నిర్వాసితులకు జగన్‌ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని రూ.900 కోట్లు బకాయి పెట్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 7321 నిర్వాసిత కుటుంబాల్లో 2560 కుటుంబాలకు రూ.318 కోట్లు చెల్లించామని.. మరో 2863 కుటుంబాలకు ఈ వారంలోనే రూ.353 కోట్లు చెల్లించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. మిగిలిన 1898 కుటుంబాలకు నెలాఖరులోగా రూ.210 కోట్లు చెల్లిస్తామని అన్నారు.


పనులు పూర్తికాకుండానే జాతికి అంకితం చేసిన జగన్‌

1980 దశకంలో ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు సూత్రప్రాయంగా వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 1996లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దీనికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ప్రాజెక్టు నిర్మాణం పడుతూ లేస్తూ వస్తోంది. 2024 ఎన్నికలకు ముందు టన్నెల్‌లో కూరుకుపోయిన యంత్రాన్ని బయటకు తీయకుండానే.. హెడ్‌రెగ్యులేటర్‌ పనులు చేపట్టకుండానే.. భూనిర్వాసితులకు పరిహారం చెల్లించకుండానే.. వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నట్లు నాటి సీఎం జగన్‌ ప్రకటించేశారు. పనులు పూర్తికాకుండానే ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసి.. వెనుకబడిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ద్రోహం చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక పెండింగ్‌ ప్రాజెక్టులపై ఫోకస్‌ పెట్టింది.


ఇవి కూడా చదవండి

భారీగా ఐఏఎస్‌ల బదిలీ

వైసీపీ వీరంగంతో గాయపడ్డ చిరు వ్యాపారి మృతి

Updated Date - Aug 08 , 2026 | 06:58 AM