Share News

ఫిట్‌‘లెస్‌’ రాకెట్‌కు క్లీన్‌చిట్‌!

ABN , Publish Date - Sep 17 , 2026 | 04:30 AM

వాహనం రోడ్డుపైకి వెళ్లడానికి ముందు అది నిజంగా ఫిట్‌గా ఉందో లేదో తేల్చాల్సిన వ్యవస్థలోనే భారీ లొసుగులు బయటపడ్డాయి. యంత్రాలతో శాస్త్రీయంగా పరీక్షించాల్సిన ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్లు(ఏటీఎస్‌) అక్రమాలకు నిలయాలుగా మారాయి. ఇదివరకు వాహనాన్ని తనిఖీ చేసి చిన్నచిన్న లోపాలున్నా లంచం తీసుకుని పలువురు మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు(ఎంవీఐ) ఎఫ్‌సీ ఇచ్చేవారు.

ఫిట్‌‘లెస్‌’ రాకెట్‌కు క్లీన్‌చిట్‌!

  • అక్రమాలకు నిలయాలుగా ఏటీఎస్‌లు

  • వాహనాలు చూడకుండానే ఎఫ్‌సీలు

  • ఏజెంట్లను సంప్రదిస్తే చాలు.. పాస్‌

  • డీటీసీల తనిఖీల్లో బయటపడ్డ లోపాలు

  • చర్యలు వద్దని రాజకీయ ఒత్తిళ్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): వాహనం రోడ్డుపైకి వెళ్లడానికి ముందు అది నిజంగా ఫిట్‌గా ఉందో లేదో తేల్చాల్సిన వ్యవస్థలోనే భారీ లొసుగులు బయటపడ్డాయి. యంత్రాలతో శాస్త్రీయంగా పరీక్షించాల్సిన ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్లు(ఏటీఎస్‌) అక్రమాలకు నిలయాలుగా మారాయి. ఇదివరకు వాహనాన్ని తనిఖీ చేసి చిన్నచిన్న లోపాలున్నా లంచం తీసుకుని పలువురు మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు(ఎంవీఐ) ఎఫ్‌సీ ఇచ్చేవారు. ఇప్పుడు అసలు వాహనమే లేకుండా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌(ఎఫ్‌సీ) జారీ చేస్తున్నారు. ఇందుకోసం ఒకప్పుడు ఆర్టీఏ ఏజెంట్లుగా ఉన్న వారితో ఒప్పందం చేసుకుంటున్నారు.

వాహనం ఏటీఎస్‌ వద్దకు ఎఫ్‌సీకి రాకపోయినా అక్కడే తాత్కాలికంగా హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ తయారు చేయించి మరో వాహనాన్ని ట్రాక్‌పైకి తీసుకెళ్లి ఎఫ్‌సీ ఇచ్చేస్తున్నారు. నిబంధనల మేరకు ఉండాల్సిన పరికరాలు లేకపోవడం.. సీసీ కెమెరాలు సరిగా పని చేయకపోవడం.. టెక్నికల్‌గా కాకుండా మాన్యువల్‌గా వాహనాల తనిఖీ జరగడం.. ఏజెంట్ల జోక్యం, అదనపు రుసుం వసూళ్లు.. ఇలా వరుస లోపాలు వెలుగు చూశాయి. టెక్నికల్‌ అధికారిని వెంట తీసుకెళ్లి ప్రత్యక్షంగా ఏటీఎస్‌లను తనిఖీలు చేసిన కొందరు డీటీసీలతో పాటు ముగ్గురు కలెక్టర్లు సైతం ఫిట్‌నెస్‌ రాకెట్‌ బాగోతంపై ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే కొన్ని ప్రాంతాల నుంచి రాజకీయ ఒత్తిళ్లు రావడంతో రవాణా శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన వారికి ఫోన్లు చేసి ‘ఎలాంటి లోపాలు గుర్తించలేదు’ అని నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో అంతా సక్రమంగా ఉన్నట్టు మరో నివేదిక ఇచ్చారు.


కేంద్రం స్ఫూర్తికి తూట్లు

రోడ్డు ప్రమాదాల నివారణా చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వాహనాల ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దేశవ్యాప్తంగా ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు సంకల్పించి రాష్ట్రాల వారీగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోంది. ఇంతకుముందు రవాణా వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లను ఎంవీఐలు జారీ చేసేవారు. కేంద్రం తీసుకొచ్చిన ఏటీఎస్‌లతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎఫ్‌సీ జారీ అంశం వెళ్లి పోయింది. 24 చోట్ల ఏర్పాటైన ఏటీఎ్‌సలలో 59 రకాల పరీక్షలు(20 ఆటోమేటెడ్‌, 39 మాన్యువల్‌) చేసి వాహనం కొనుగోలు చేసినప్పుడు ఎలాంటి కండీషన్‌లో ఉందో అదే తరహాలో ఉంటే ఎఫ్‌సీ జారీ చేయాలి. ఎక్కడ లోపం ఉన్నా ఫెయిల్‌ చేసి, దాన్ని సరిదిద్దుకుని వచ్చాక మరోమారు ఎఫ్‌సీ చేయాలి. అందుకు భిన్నంగా ఏటీఎస్‌ కేంద్రాల్లో మాన్యువల్‌గా చూసే 39 పరీక్షలే గాక ఆటోమేటెడ్‌ పరీక్షల్లోనూ అవకతవకలు జరుగుతున్నట్లు వరుస ఫిర్యాదులు రవాణా శాఖకు వచ్చాయి.

డీటీసీల తనిఖీలతో అక్రమాలు వెలుగులోకి

రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వరుస ఫిర్యాదులపై రవాణా శాఖ కమిషనర్‌ మనీశ్‌ కుమార్‌ సిన్హా స్పందించారు. ఆయా జిల్లాలతో సంబంధం లేని పొరుగు జిల్లాల డీటీసీలు, ఆర్టీవోలతో ఏటీఎ్‌సలలో తనిఖీలు చేయించారు. అసలు వాహనం చూడకుండానే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తున్నట్లు బయట పడింది. జియో ట్యాగింగ్‌ ఉన్నా ఎలా చేస్తున్నారని ఆరా తీశారు. ఏటీఎస్‌ కేంద్రం పక్కనే హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్లు (నాసికరం) అప్పటికప్పుడు తయారు చేయించి ఒకే బండికి పది రకాల నంబర్‌ ప్లేట్లు అమర్చి, వాటికి ఫొటోలు తీసి అసలు బండి ఫిట్‌నెస్‌లో పాసైనట్లు చూపిస్తున్నట్టు తేలింది. ఏటీఎస్‌ కేంద్రాల్లో ఉండే ఇద్దరు, ముగ్గురు సిబ్బంది(ఏడుగురు ఉండాలి), అక్కడి ఏజెంట్లు కుమ్మక్కై ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఫిట్‌నెస్‌ పరీక్షకు సాక్ష్యంగా ఉండాల్సిన సీసీ కెమెరాలు చాలా చోట్ల పని చేయలేదని, ఆటోమేటెడ్‌ ఎఫ్‌సీకి అవసరమైన 19 రకాల పరికరాలు లేవని, 6-8 మాత్రమే ఉన్నాయని మొదటి నివేదికలో పొందు పరిచినట్లు తెలిసింది. చాసిస్‌ నంబర్‌ ట్యాంపరింగ్‌ జరిగితే గుర్తించే పరికరాలు కొన్ని ఏటీఎస్‌ కేంద్రాల్లో లేవని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.


గంటకు 50కి పైగా ఎఫ్‌సీలు

ఉత్తరాంధ్రలోని ఒక ఏటీఎ్‌సలో గంటకు 50కి పైగా వాహనాలకు ఎఫ్‌సీలు చేసినట్లు తనిఖీలకు వెళ్లిన డీటీసీకి రికార్డులు లభించినట్లు తెలిసింది. ఒక బండికి 59 రకాల పరీక్షలు చేయాలంటే కనీసం పావు గంట పడుతుందని, గంటకు నాలుగు భారీ వాహనాలు, ఆరు చిన్న వాహనాలు మాత్రమే చేయగలమని చెబుతున్నారు. అలాంటప్పుడు యాభైకి పైగా ఎలా చేశారని ప్రశ్నిస్తే అక్కడున్న సిబ్బంది నోరెళ్ల బెట్టారని తెలుస్తోంది. తనిఖీ అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకుని బయటికి వెళ్లేలోపు ఏటీఎస్‌ యజమాని ఒక కీలక ఎంపీకి ఫోన్‌ చేశారు. ఆ వెంటనే రవాణా శాఖ ఉన్నతాధికారుల నుంచి తనిఖీలకు వెళ్లిన అధికారులకు ఫోన్లు వచ్చాయి. విశాఖపట్నంలో అయితే పోలీసులు పది రోజుల క్రితం యాక్సిడెంట్‌ కేసులో స్వాధీనం చేసుకున్న లారీకి ఏటీఎస్‌ నుంచి ఎఫ్‌సీ వచ్చింది.

ముగ్గురు కలెక్టర్ల నివేదిక

ఏటీఎస్‌లలో అక్రమాలపై తమకు అందిన ఫిర్యాదుల మేరకు మూడు జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిసింది. రాయల సీమలో ఒకరు, రాజధాని ప్రాంతంలో మరొకరు, గోదావరి జిల్లాలకు చెందిన ఇంకో కలెక్టర్‌ నివేదికలు పంపారు. కలెక్టర్లు నివేదిక ఇచ్చే ముందు ఒకరిద్దరు ఏటీఎస్‌ నిర్వాహకుల్ని పిలిచి మాట్లాడారు. ‘మాకు రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి ఫీజు రావట్లేదు. అడిగితే ఒక మంత్రి పర్సెంటేజీ డిమాండ్‌ చేస్తున్నారు. అదనంగా తీసుకోవడం తప్ప మాకు మార్గం కనిపించలేదు’ అంటూ ఓ నిర్వాహకుడు రాయలసీమకు చెందిన ఒక మాటకారి మంత్రి పేరు చెప్పినట్లు తెలిసింది.


ఈ వార్తలనూ చదవండి:

గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్

ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య

Updated Date - Sep 17 , 2026 | 04:30 AM