Share News

దాతృత్వంలో మేటి వర్ధమాన్‌ జైన్‌

ABN , Publish Date - Nov 27 , 2026 | 05:35 AM

చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వర్ధమాన్‌ జైన్‌. హెల్త్‌కేర్‌ టెక్నాలజీ, బీపీవో, ఆటోమేషన్‌ రంగాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందారు. చెన్నై లయోలా కాలేజీలో స్టాటిస్టిక్స్‌ చదువుకున్న ఆయన యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో...

దాతృత్వంలో మేటి వర్ధమాన్‌ జైన్‌

  • 2019 నుంచే టీటీడీకి విరాళాలు

  • గతేడాది అమెరికా కంపెనీకి తన సంస్థ విక్రయం

  • ఆ సొమ్ము నుంచే శ్రీవారికి 121 కిలోల ఆభరణాలు

చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వర్ధమాన్‌ జైన్‌. హెల్త్‌కేర్‌ టెక్నాలజీ, బీపీవో, ఆటోమేషన్‌ రంగాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందారు. చెన్నై లయోలా కాలేజీలో స్టాటిస్టిక్స్‌ చదువుకున్న ఆయన యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేశారు. యాక్సెస్‌ హెల్త్‌కేర్‌ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, మెడికల్‌ కోడింగ్‌కు సంబంధించి పలు పేటెంట్లు పొందారు. 2019 నుంచే టీటీడీకి విరాళాలు ఇస్తూ ప్రత్యేక దాతగా పేరొందారు. ఎస్వీబీసీ అభివృద్ధికి దాదాపు రూ.7 కోట్లు, గోసంరక్షణకు పశుగ్రాస మిక్సింగ్‌ ప్లాంట్‌, కాయిన్‌ కౌంటింగ్‌ మిషన్‌, ఈ ఏడాది మే నెలలో ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా ఇచ్చారు.

తాజాగా 121 కేజీల బంగారాన్ని సమర్పించి శ్రీవారి దాతల జాబితాలో ప్రథమ స్థానాన్ని పొందారు. గతేడాది తన కంపెనీని న్యూయార్క్‌లోని ఒక ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థకు విక్రయించగా వచ్చిన డబ్బు నుంచి ఆయన ఈ బంగారాన్ని సమర్పించారు. వర్ధమాన్‌ హెల్త్‌కేర్‌ టెక్నాలజీ రంగంలో విశేష అనుభవం ఉన్న వ్యాపారవేత్త. వరా ఫ్యామిలీ ఆఫీస్‌ వ్యవస్థాపకుడిగా, వరా ట్రస్ట్‌, శారిత జైన్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీగా కొనసాగుతున్నారు. 2011లో యాక్సెస్‌ హెల్త్‌కేర్‌ను సహ వ్యవస్థాపకుడిగా ప్రారంభించిన ఆయన ఆ సంస్థను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు.


వరా సంస్థ ద్వారా ఉపాధి కల్పనతో పాటు సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. తన భార్యతో కలిసి విద్య, వైద్యం, ఆహార భద్రతతో పాటు గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం, విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉపకార వేతనాల ద్వారా 14వేల మందికిపైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చారు. ప్రముఖ ఆస్ప్రతులకు అత్యాధునిక వైద్య పరికరాలు అందిస్తున్నారు. గతేడాది ఆగస్టులో పీ4 కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు ‘ఒక అజ్ఞాత భక్తుడు శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు సమర్పించనున్నారు’ అని ప్రకటన చేశారు. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో ఒక రకమైన ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు ఆ ప్రశ్నలన్నింటికీ గురువారం సమాధానాలు లభించాయి.

ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 05:39 AM