Share News

స్వగ్రామాల్లో గడపండి

ABN , Publish Date - Nov 13 , 2026 | 04:35 AM

‘జన్మభూమితో కేవలం డిజిటల్‌ సంబంధాన్ని కలిగి ఉండడమే కాదు... భౌతిక బంధాన్ని కూడ పటిష్ఠం చేసుకోవాలి. స్వదేశానికి వెళ్లినప్పుడల్లా స్వగ్రామాల్లో గడపండి’ అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ సూచించారు.

స్వగ్రామాల్లో గడపండి

  • కేవలం డిజిటల్‌గానే కాదు.. భౌతికంగానూ జన్మభూమితో బంధాన్ని పటిష్ఠం చేసుకోండి

  • ఖతర్‌లో ప్రవాసాంధ్రులతో మంత్రి పెమ్మసాని

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): ‘జన్మభూమితో కేవలం డిజిటల్‌ సంబంధాన్ని కలిగి ఉండడమే కాదు... భౌతిక బంధాన్ని కూడ పటిష్ఠం చేసుకోవాలి. స్వదేశానికి వెళ్లినప్పుడల్లా స్వగ్రామాల్లో గడపండి’ అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ సూచించారు. అంతర్జాతీయ టెలికాం సదస్సులో పాల్గొనడానికి ఖతర్‌కు వచ్చిన ఆయన ప్రవాసాంధ్రులతోనూ, ప్రత్యేకించి తన నియోజకవర్గానికి చెందిన వారితోనూ బుధవారం రాత్రి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా 15 బిలియన్‌ డాలర్ల భారత్‌ నెట్‌ ప్రాజెక్టులను, డిజిటల్‌ విప్లవ ఫలితాలను, రిమోట్‌ వర్కింగ్‌ సంస్కృతికి దోహదపడే వివిధ ప్రాజెక్టులనూ వారికి వివరించారు. ‘విదేశాల్లో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డా స్వదేశంలో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మలుచుకోవాలి. తెలుగు రాష్ర్టాలతో సహా దేశవ్యాప్తంగా టెలికం టవర్లు నిర్మించినా వాటి నిర్వహణను గాలికి వదిలేశారు. దీంతో అవి సక్రమంగా పని చేయకపోవడంతో సెల్‌ సిగ్నళ్ల సమస్య ఏర్పడింది. నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత టవర్ల పని తీరును రెట్టింపు చేశాం. తెలుగు రాష్ట్రాల్లో టవర్ల సంఖ్యను రానున్న రెండేళ్లలో 2.70 లక్షలకు హెచ్చించాలనే లక్ష్యంతో ఉన్నాం. రాష్ర్టాభివృద్ధి కొరకు టెక్నాలజీని విరివిగా అందుబాటులోకి తీసుకురావాలని, తద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని సీఎం చంద్రబాబు, యువనేత లోకేశ్‌ ప్రయత్నిస్తున్నారు.

అందుకు అనుగుణంగానే మేం పని చేస్తున్నాం’ అని పెమ్మసాని పేర్కొన్నారు. దీనికి ముందు అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ... ‘సైబర్‌ నేరాలకు సరిహద్దులు లేవు. అన్ని దేశాలు కలసి సమిష్ఠిగా వాటిని ఎదుర్కోవాలి’ అని మంత్రి పిలుపునిచ్చారు. కాగా బుధవారం సాయంత్రం ఆయన భారత రాయబారి నివాసంలోనూ పలువురితో సమావేశమయ్యారు. గురువారం సాయంత్రం ఖతార్‌లోని టీడీపీకి చెందిన రెండు వర్గాలతోనూ ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం

ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు

Updated Date - Nov 13 , 2026 | 04:40 AM