ఆ వీధికి రెండు వైపులా రెండు జిల్లాలు!
ABN , Publish Date - Nov 26 , 2026 | 06:01 AM
‘ఆ వీధి’కి ఇరువైపులా రెండు గ్రామాలు ఉండగా.. అవి రెండు మండలాలకు, రెండు జిల్లాలకు సరిహద్దు కావడం విశేషం.
భోగ్యంవారిపల్లి, తిరగలదిన్నె గ్రామాల ప్రత్యేకత
ఉదయగిరి రూరల్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ‘ఆ వీధి’కి ఇరువైపులా రెండు గ్రామాలు ఉండగా.. అవి రెండు మండలాలకు, రెండు జిల్లాలకు సరిహద్దు కావడం విశేషం. నెల్లూరు, మార్కాపురం జిల్లాలకు సరిహద్దుగా మారిన ‘ఆ వీధి’ ప్రత్యేకత గురించి ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల వేళ మరోసారి చర్చ జరుగుతోంది. వీధికి దక్షిణం వైపున నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని భోగ్యంవారిపల్లి, ఉత్తరం వైపున మార్కాపురం జిల్లా పామూరు మండలంలోని తిరగలదిన్నె గ్రామాలు ఉండగా.. ఆ రెండు గ్రామాల ప్రజలు పనులపై బయటకు వెళ్లాలన్నా, ప్రయాణాలు సాగించాలన్నా ఆ వీధికి ఆనుకొని పడమర వైపు ఉన్న 565 జాతీయ రహదారిపైకి చేరుకోవాల్సిందే.
ఎన్నికల వేళ తప్ప ఏనాడూ అవి రెండు గ్రామాలు అన్న విషయమే అక్కడివారికి గుర్తురాదు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆ రెండు గ్రామాల్లో ఇరు జిల్లాలకు చెందిన అభ్యర్థులు ప్రచారం చేపడుతుండడంతో సందడి నెలకొంది. వేంపాడు పంచాయతీకి చెందిన భోగ్యంవారిపల్లిలో 10 కుటుంబాలు, పామూరు పంచాయతీకి చెందిన తిరగలదిన్నెలో సుమారు 100 కుటుంబాలు ఉన్నాయి. ఆ రెండు పంచాయతీలూ బీసీ జనరల్‌కు కేటాయించడం విశేషం.
కాగా పామూరు పంచాయతీ ఎన్నికలు గురువారం జరగనుండగా, వేంపాడు పంచాయతీలోని ఓటర్లు 29న తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. కాగా, రెండు జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు కూతవేటు దూరంలోనే విడివిడిగా రెండు చెక్‌పోస్టులను సైతం ఏర్పాటు చేస్తుండడం కొసమెరుపు!
ఈ వార్తలనూ చదవండి:
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్