నెల్లూరుకు కొట్టుకొచ్చిన చెన్నై మత్స్యకారుల మృతదేహాలు
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:22 AM
సముద్రంలో గల్లంతైన చెన్నైకు చెందిన ఇద్దరు మత్స్యకారుల మృతదేహాలను నెల్లూరు జిల్లా కావలి మండలంలక్ష్మీపురం తీరంలో స్థానికులు ఆదివారం గుర్తించారు.
లక్ష్మీపురంలో రెండింటిని గుర్తించిన పోలీసులు
పోస్టుమార్టం పూర్తి, బంధువులకు అప్పగింత
కావలి రూరల్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : సముద్రంలో గల్లంతైన చెన్నైకు చెందిన ఇద్దరు మత్స్యకారుల మృతదేహాలను నెల్లూరు జిల్లా కావలి మండలంలక్ష్మీపురం తీరంలో స్థానికులు ఆదివారం గుర్తించారు. గత నెల 29న తమిళనాడుకు చెందిన 9 మంది మత్స్యకారులు ఉన్న బోటు మురుసు తుఫాన్ ప్రభావంతో అలల తాకిడికి కొట్టుకు వచ్చి ప్రకాశం జిల్లా తీరానికి సమీపంలో మునిగిపోయిన విషయం తెలిసిందే.
బోటులో ఉన్న వారిలో ఐదుగురి మృతదేహాలు ఈ నెల 5న కొత్తపట్నం బీచ్‌కు (ప్రకాశం జిల్లా) కొట్టుకు వచ్చాయి. 6న కొత్తపట్నం మండలం వజ్జిరెడ్డిపాలెం బీచ్‌లో ఒక మృతదేహం, అదేరోజు శింగరాయకొండ మండలం ఊళ్లపాలెం బీచ్‌కు మరో మృతదేహం కొట్టుకువచ్చింది. గల్లంతైన మరో ఇద్దరి ఆచూకీ లభించక పోవటంతో వారి కుటుంబ సభ్యులతోపాటు మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈనేపథ్యంలో కావలి మండలంలోని లక్ష్మీపురం తీరంలో ఆదివారం ఒడ్డుకు రెండు మృతదేహాలు కొట్టుకువచ్చాయి. అవి చెన్నైకు చెందిన మునియప్పన్ నారాయణన్ (58), రాజేష్(50) మృతదేహాలుగా పోలీసులు గుర్తించారు.
మెరైన్ సీఐ ఫిరోజ్‌తోపాటు రూరల్ సీఐ జి.రాజేశ్వరరావు ఆదేశాలతో రూరల్ ఎస్‌ఐ తిరుమల రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం చెన్త్నె ఫిషరీస్ అధికారుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ వార్తలనూ చదవండి: