8.34 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనాలు
ABN , Publish Date - Nov 19 , 2026 | 05:07 AM
వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబరు 20 నుంచి 29 వరకు పది రోజులపాటు 8.34 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నట్టు...
92 శాతం సామాన్య భక్తులకే కేటాయింపు.. టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ సమావేశంలో నిర్ణయం
రూ.2,750 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమేజ్ టౌన్‌షిప్
శ్రీవారి నిత్య కైంకర్యాల కోసం 500 దేశీయ ఆవుల కొనుగోలు
అలిపిరి నడక మార్గంలో సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం
తిరుపతి(టీటీడీ), నవంబరు 18(ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబరు 20 నుంచి 29 వరకు పది రోజులపాటు 8.34 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నట్టు టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. గతేడాది పది రోజులపాటు వైకుంఠ ద్వారం ద్వారా 8.83 లక్షల మంది దర్శనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఏడాది అదనంగా మరో 51వేల మందికి శ్రీవారి దర్శనం కల్పిస్తామని తెలిపారు.
ఇందులో 92 శాతం దర్శనాలు సామాన్య భక్తులకు కేటాయించనున్నారు. తొలి రెండు రోజులు ఈ-డిప్ ద్వారా 1.60 లక్షల మందికి, మూడో రోజు నుంచి రోజుకు 15 వేల ఆన్‌లైన్ టోకెన్లు జారీ చేయనున్నారు. బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో స్పెసిఫైడ్ అథారిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్పెసిఫైడ్ అథారిటీ సభ్యులు, దేవదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్‌చంద్‌తోపాటు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈవోలు ఎ.శరత్, ప్రభల గోపినాథ్, సీవీఎస్వో మురళీకృష్ణ, చీఫ్ ఇంజనీర్ మనోహరం పాల్గొన్నారు. సమావేశం అనంతరం రవిచంద్ర మీడియాకు వివరాలను వెల్లడించారు. తిరుపతిలో రూ.2,750 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమేజ్ టౌన్‌షిప్ నిర్మించనున్నారు. అలిపిరి నడకమార్గంలో నరసింహస్వామి ఆలయం నుంచి మోకాలి మిట్ట వరకు సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణ సాధ్యాసాధ్యాలపై ఐఐటీతో అధ్యయనం చేయించనున్నారు.
తిరుమలకు అవసరమైన విద్యుత్‌ను స్థానికంగా ఉత్పత్తి చేసుకునేందుకు నెట్‌జీరో విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రిటైర్డ్ సీఈ సత్యనారాయణ సేవలను ఏడాదిపాటు వినియోగించుకునేందుకు ఆమోదం తెలిపారు. శ్రీవారి నిత్య కైంకర్యాలకు అవసరమైన నెయ్యి కోసం రూ.7.50 కోట్లతో 500 దేశీయ ఆవులను కొనుగోలు చేయనున్నారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో మౌలిక వసతులకు రూ.230 కోట్లు, అటవీ ప్రాణులు, భక్తుల రక్షణకు అటవీ శాఖకు రూ.16.40 కోట్లు, శ్రీనివాసమంగాపురం నుంచి శ్రీవారి మెట్టు వరకు రహదారి అభివృద్థికి రూ.9.50 కోట్లు కేటాయించారు. స్విమ్స్ కొనుగోళ్ల బకాయిల చెల్లింపునకు రూ.41.23 కోట్ల ప్రత్యేక గ్రాంటు మంజూరు చేశారు.
ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా రెగ్యులర్ సిబ్బందికి రూ.16,940, ఇతర ఉద్యోగులకు అందులో సగం మొత్తం ఇవ్వనున్నారు. తిరుమలలో అదనంగా 321 మంది పారిశుధ్య కార్మికులు, 27 మంది సూపర్‌వైజర్లను నియమించనున్నారు. ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో బీఏఎంఎస్(యూజీ) కోర్సుకు 20 సీట్లు పెంచనున్నారు. అలిపిరి సమీపంలోని శ్రీవేంకటేశ్వర సంప్రదాయ శిల్ప కళా, వాస్తు శిల్ప సంస్థలో 229 మంది విద్యార్థుల కోసం రూ.23 కోట్లతో కొత్త హాస్టల్ నిర్మించనున్నారు. టీటీడీ అగరబత్తీల తయారీ, ప్యాకేజింగ్ బాధ్యతలను మూడేళ్లపాటు పాటిల్ పరిమళ కంపెనీకి అప్పగించారు.
దీని అంచనా వ్యయం రూ.90 కోట్లు. నాలాయిర దివ్యప్రబంధ పారాయణదారుల సంభావన పెంచాలని నిర్ణయించారు. ఇటీవల మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు పరిహారం అందించడంతోపాటు, అర్హులైన కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల ఆర్థిక ప్రయోజనం కల్పించే సమగ్ర సంక్షేమ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఐఐటీ, ఐజర్ సహకారంతో నైపుణ్యాభివృద్థి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ఐఐటీలో 300 మంది విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించేందుకు ఎస్వీ విద్యాదాన ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం, అలిపిరి శిల్ప కళాశాల వద్ద మరో కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఆమోదముద్ర వేశారు. దీన్ని శ్రీసిటీలోని పరిశ్రమలతో అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. టీటీడీ హెచ్‌ఆర్ విభాగాన్ని నెల రోజుల్లో పునర్వ్యవస్థీకరించి, అవసరమైన ఉద్యోగ నియామకాలపై తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్
పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్