14 కి.మీ భుజాలపై మోసి.. ఓటేయించి!
ABN , Publish Date - Nov 28 , 2026 | 01:06 AM
అనారోగ్యంతో మంచానికే పరిమితమైన భార్యకు ఆమె ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలని అనుకున్నాడు ఆ భర్త! అతని సంకల్పం ముందు ఎంతో కష్టమైన ‘మార్గం’ కూడా తలవంచింది.
భార్యకు ‘ఓటు హక్కు’ కల్పించిన భర్త
ఎస్.కోట రూరల్, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో మంచానికే పరిమితమైన భార్యకు ఆమె ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలని అనుకున్నాడు ఆ భర్త! అతని సంకల్పం ముందు ఎంతో కష్టమైన ‘మార్గం’ కూడా తలవంచింది. భార్యను తన భుజాలపై సుమారు 14 కిలోమీటర్ల మేర మోసి.. ఎట్టకేలకు ఓటు వేయించి, మళ్లీ ఇంటికి చేర్చాడు. ఆ గిరిజనుడు చేసిన ఈ గొప్ప పని అందరికీ ఆదర్శనీయంగా మారింది. వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని మూలబొడ్డవర పంచాయతీలో గురువారం ఎన్నికలు జరిగాయి.
ఈ పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామమైన చిట్టంపాడు ఓటర్లు మైదాన ప్రాంతంలోని బొడ్డవర పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలి. ఈ గ్రామానికి చెందిన ఎర్రయ్య భార్య చిలకమ్మ అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. అయితే భార్యను ఇంట్లోనే వదిలి వెళ్లకుండా, ఆమెకు కూడా ఓటు హక్కు కల్పించాలని ఎర్రయ్య నిర్ణయించుకున్నాడు. ఆమెను భుజాలపై ఎక్కించుకుని బయలుదేరాడు. రాళ్లు, గుట్టలు, కొండలు దాటుకుంటూ ఏడు కిలోమీటర్లు నడిచి మైదాన ప్రాంతంలోని మెట్టపాలెం చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆటోలో బొడ్డవరకు వెళ్లి భార్యతో ఓటు వేయించి తానూ వేశాడు. అనంతరం ఆమెను భుజాలపై మోసుకుంటూ తిరిగి ఇద్దరూ గ్రామానికి చేరుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు
బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..