ఆదివాసీల వైద్యానికి ‘ట్రైబల్ సెల్’..
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:46 AM
తూరుపు కనుమల్లోని మారుమూల పల్లెల్లో ఆదివాసీలు లిపి లేని 11 భాషలతో మాట్లాడతారు. వీరు వైద్యం కోసం నగరానికి వచ్చినపుడు భాషతో ఇబ్బంది పడుతుంటారు. ఛత్తీస్‌ఘడ్, ఒడిశా, ఏపీలోని మన్యం ప్రాంతాల నుంచి వైద్యం కోసం విశాఖలోని కేజీహెచ్‌కి వస్తుంటారు.
‘మీకు ఆరోగ్యం బాగా లేకపోతే ఎక్కడికి వెళ్తారు?’
‘మాకు దగ్గరలో ఉన్న ఆరోగ్యకేంద్రానికండీ...’
‘అక్కడ తగ్గకపోతే..?’
‘పక్క ఊరిలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రికి పోతాం బాబు. అక్కడ తగ్గితే తగ్గినట్టు అంతే...’ అన్నారు పార్వతీపురం జిల్లా, సీతంపేట కొండ మీదున్న ఒక ఆవాసం ఆదివాసీలు.
‘వైజాగ్‌లో పెద్ద ఆసుపత్రి ఉంది కదా అక్కడికి వెళ్లలేరా?’ అని అడిగినపుడు ‘అదొక మహా సముద్రమండీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మాలో కొందరికి తెలుగు రాదు. మా కొండ భాష వారికి అర్ధం కాదు...’ అని నిరాశగా చెప్పారు.
కొండ కోనల్లో, అడవుల్లో పుట్టి పెరిగిన ఆదివాసీలకు నగర ఆసుపత్రి ఒక అపరిచిత ప్రపంచం. తెల్ల గోడలు, తెల్ల కోట్లు, పద్మవ్యూహం లాంటి వార్డులు, వాటి మధ్య హడావుడిగా తిరిగే నర్సులు.. ఈ వాతావరణం ఆ అమాయకులను భయాందోళనలకు గురి చేస్తుంది. అయితే ఆ భయాల్ని తొలగించి, వారి భాషలోనే మాట్లాడుతూ సమస్యలు తెలుసుకొని, ధైర్యం చెప్పి వైద్యం అందించే అరుదైన ఒక ప్రయోగం విశాఖపట్నంలోని ‘కింగ్ జార్జ్ హాస్పిటల్’ (కేజీహెచ్)లో కొనసాగుతోంది. అక్కడ గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైనదే ‘ట్రైబల్ సెల్’.
లిపి లేని భాషలకు వైద్య భరోసా
తూరుపు కనుమల్లోని మారుమూల పల్లెల్లో ఆదివాసీలు లిపి లేని 11 భాషలతో మాట్లాడతారు. వీరు వైద్యం కోసం నగరానికి వచ్చినపుడు భాషతో ఇబ్బంది పడుతుంటారు. ఛత్తీస్‌ఘడ్, ఒడిశా, ఏపీలోని మన్యం ప్రాంతాల నుంచి వైద్యం కోసం విశాఖలోని కేజీహెచ్‌కి వస్తుంటారు. వారికి భాష సమస్య కాకుండా 2005లో, అప్పటి పాడేరు ఐటీడీఏ చొరవతో ట్రైబల్ సెల్ ప్రారంభమైంది.
ఆసుపత్రిలో ఆదివాసీ గ్రామం కేజీహెచ్‌లోకి ప్రవేశించగానే ప్రధాన ఔట్ పేషెంట్ భవనంలో, క్యాజువాల్టీకి పక్కనే ఉన్న ట్రైబల్ సెల్... ఆసుపత్రిలోనే ఒక చిన్న ఆదివాసీ గ్రామంలా కనిపిస్తుంది.
‘‘అనేక బ్లాక్‌లు, వార్డులున్న ఈ పెద్ద ఆసుపత్రిలో ఆదివాసీలకు ఎక్కడికి వెళ్లాలో తెలియకపోవడం లాంటి భయాలన్నీ ఇప్పుడు తొలగిపోయాయి. ప్రవేశ ద్వారం దగ్గరలోనే ఈ సెల్ ఉండటం వల్ల అన్ని సేవలు పొంద వచ్చు. ఈ సెల్ నిర్వహణ కోసం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేవారినే ఇక్కడనియమించారు. వారి ఆచార వ్యవహారాలు, భాష మీద పట్టు ఉండడంతో రోగులతో వీరు సులభంగా కలిసి పోతున్నారు. ప్రతీ వార్డులో గిరిజనుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. వారితో పాటు సహాయంగా వచ్చిన వారికి భోజన, వసతి కల్పిస్తారు. చికిత్స అనంతరం వారిని ఇంటి దగ్గర దించడానికి అంబులెన్స్‌లు కూడా ఏర్పాటు చేశాం’’ అన్నారు ‘ట్రైబల్ సెల్’ చీఫ్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎ. సంపత్.
భాషే మొదటి మందు!
ఇక్కడ 11 మంది వైద్య సిబ్బంది ఉంటారు. ఏటా 10 వేలకు పైగా గిరిజనులు వైద్య సేవలు పొందుతున్నారు. ఇదే ట్రైబల్ సెల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం, కాకినాడ, నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా కొండప్రజలకు సేవలు అందిస్తారు. ‘‘ఆదివాసీలు అర్ధం చేసు కోగలిగే కోయ, కొటియా, వాల్మీకి, గదబ, కొండ రొడ్డి, జాతాపు, సవర భాషల్లో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటాం. డాక్టర్లకు పేషెంట్లకు మధ్య భాషా సమస్యలు రాకుండా మేం కోఆర్డినేట్ చేస్తున్నాం’’ అన్నారు సెల్ కోఆర్టినేటర్ జి.సత్యారావు. ఆయనకు ఆదివాసీ భాషలన్నీ వచ్చు.
అన్ని వ్యాధులకు ఉచిత చికిత్స
క్యాన్సర్ నుంచి సాధారణ జ్వరాల వరకూ, కాలిన గాయాల నుంచి రోడ్డు ప్రమాదాలు వంటి అన్ని కేసులు ఇక్కడ చూస్తారు. అత్యవసర మందులు, ల్యాబ్ పరీక్షలు, కౌన్సెలింగ్, ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
‘‘రోగం మాత్రమే కాదు, వారి జీవితం, అల వాట్లు, భయాలు తెలుసుకొని వైద్యం చేస్తాం. అది కూడా చికిత్సలో భాగమే. పౌష్టికాహార లోపం వల్ల వచ్చే రక్తహీనత సమస్యలు వీరిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అరుదైన వ్యాధులకు అవసరమైన పరిశోధన కూడా ఇక్కడ జరుగుతుంది. మన్యం ప్రాంతాల్లో ఎక్కువగాకనిపించే ‘సికిల్ సెల్ అనీమియా’ వంటి అరుదైన వ్యాధులు ఈ సెల్‌ను ఒక పరిశోధనాకేంద్రంగా కూడా మార్చాయి.
ప్రతీ పేషెంట్‌కి చికిత్స అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి పంపుతుంటాం’’ అంటారు మన్యం జిల్లా కో ఆర్డినేటర్ సంధ్య. ఈ ట్రైబల్ సెల్‌లో సిబ్బంది 24 గంటలూ సేవలందిస్తూ, మూడు షిఫ్టుల్లో పని చేస్తారు. ఐదు ఐటిడీఏల ప్రజల అవసరాలను చూసే ఇంత పెద్ద ట్రైబల్ సెల్ దేశంలో మరెక్కడా లేదు. ఈ వైద్యుల లక్ష్యం ఒక్కటే. అడవుల్లో ఉన్న ఆదివాసీలను ఆసుపత్రికి దగ్గర చేయడం. ఇక్కడ పనిచేసే చాలామంది వైద్యులు, సిబ్బంది ఆదివాసీ ప్రాంతాల్లోనే పుట్టి పెరిగినవారు. వాళ్లకు ఆదివాసీ జీవితం... చదివిన డిగ్రీల కన్నా ముందే తెలుసు. అదే ఈ సెల్‌కు ప్రాణం. దేశవ్యాప్తంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఇలాంటి ట్రైబల్ సెల్‌లు ఏర్పడాల్సిన అవసరాన్ని విశాఖ కేజీహెచ్ నిరూపిస్తోంది.
- శ్యాంమోహన్, 944059 5858
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News