121 కిలోలు.. 45 ఆభరణాలు
ABN , Publish Date - Nov 26 , 2026 | 03:55 AM
తిరుమల శ్రీవారికి 121 కేజీల స్వర్ణాభరణాల సెట్ కానుకగా అందనుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఓ ఎన్‌ఆర్‌ఐ భక్తుడు స్వామివారికి గురువారం వీటిని బహూకరించనున్నారు.
వాటిలో శ్రీవారికి కిరీటం, శంఖుచక్రాలు, కటి వరద హస్తాలు, పాదుకలు
టీటీడీకి అందజేసేది నేడే.. సీఎం చంద్రబాబు సమక్షంలో ఎన్‌ఆర్‌ఐ భక్తుడి విశేష కానుక
ఆభరణాల ప్రదర్శనకు రంగనాయక మండపంలో చెక్క వేదిక సిద్ధం
తిరుమల, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారికి 121 కేజీల స్వర్ణాభరణాల సెట్ కానుకగా అందనుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఓ ఎన్‌ఆర్‌ఐ భక్తుడు స్వామివారికి గురువారం వీటిని బహూకరించనున్నారు. ఈ విరాళానికి సంబంధించి చంద్రబాబు గతేడాది ప్రకటన చేసిన విషయం తెలిసిందే. టీటీడీ అధికారులు, అర్చకులు, బొక్కసం అధికారుల సూచనల మేరకు శ్రీవారికి శిరస్సు నుంచి పాదాల వరకు అలంకరించేలా కిరీటం, శంఖుచక్రాలు, కటి వరద హస్తాలు, వడ్డాణం, పాదుకలు ఇలా దాదాపు 45 రకాల ఆభరణాలను ఓ జ్యువెలరీ సంస్థ ద్వారా దాత తయారు చేయించారు. ఇప్పటికే ఇవి తిరుపతికి చేరుకున్నాయి.
వీటిని అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో గురువారం ఉదయం 8.30 గంటలకు తిరుమలకు తీసుకురానున్నారు. ఈ ఆభరణాల ప్రదర్శన కోసం శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో చెక్కలతో వేదికను బుధవారం రాత్రి సిద్ధం చేశారు. కాగా, సీఎం చంద్రబాబు ఉదయం 10.45 గంటలకు తిరుమలలోని గాయత్రి అతిథి గృహానికి చేరుకుని సంప్రదాయ వస్త్రధారణలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయానికి చేరుకుంటారు. అక్కడ సీఎం సమక్షంలో దాత స్వర్ణాభరణాలను టీటీడీకి అందజేస్తారు.
శ్రీవారిని దర్శించుకున్న తర్వాత చంద్రబాబు తిరిగి అతిథిగృహానికి చేరుకుంటారు. వైకుంఠ ద్వార దర్శనాలు, చేపట్టాల్సిన ఏర్పాట్లు, టికెట్ల కేటాయింపు వంటి వాటిపై కొద్దిసేపు అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం బంగారు ఆభరణాల విరాళానికి సంబంధించిన వివరాలతో పాటు వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లను మీడియాకు వివరిస్తారు.
టీటీడీ చరిత్రలోనే భారీ విరాళం
తిరుమల శ్రీవారి గర్భాలయంలోని మూలవిరాట్టుతో పాటు ఉత్సవమూర్తుల అలంకరణకు ఇప్పటికే దాదాపు 650 కేజీల ఆభరణాలు ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.6వేల కోట్లకు పైమాటే. వాటిలో పొదిగిన వజ్రాలు, రత్నాలు, కెంపులు కూడా కలిపితే వాటి విలువ రూ.10 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఇవన్నీ పురాతన కాలం నుంచి ఒక్కొక్కటిగా శ్రీవారికి అందినవే. అయితే టీటీడీ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఒకేసారి ఒకే భక్తుడి నుంచి 121 కేజీల ఆభరణాల సెట్ కానుకగా అందడం మాత్రం ఇదే తొలిసారి.
ఆకాశరాజు నుంచి.. విరాళాల వెల్లువ
శ్రీనివాసుడికి తొలుత ఆకాశరాజు బంగారు కిరీటం చేయించాడని పురాణ కథనం. ఆ తర్వాత 12వ శతాబ్దం వరకు స్వర్ణాభరణాలు, వస్తువులు దఫాల వారీగా స్వామివారికి అందినప్పటికీ ఆ వివరాలు ఎక్కడా నమోదు కాలేదు. అయితే 12వ శతాబ్దం నుంచే స్వర్ణాభరణాలు భారీగా అందాయని శాసనాల ద్వారా తెలుస్తోంది.
బ్రిటిష్ పాలనలో చిత్తూరు కలెక్టరుగా పనిచేసిన థామస్ మన్రో పెద్ద గంగాళాన్ని కానుకగా ఇచ్చారు.
మొఘల్ చక్రవర్తులైన అక్బర్, జహంగీర్ ముద్రలతో 500 నాణేలతో ఉన్న దండతో పాటు కింగ్ జార్జ్, విక్టోరియా రాణి చిత్రం ఉన్న 492 నాణేలతో ఉన్న హారాలు స్వామికి కానుకగా అందాయి.
శ్రీ వేంకటేశ్వర హేచరీస్ 13 కేజీల కిరీటం, సంజీవ్ గోయెంకా 10 కేజీల బంగారు కిరీటాలు బహూకరించారు.
స్వామివారి సహస్రకలశాభిషేకంలో వాడే 108 బంగారు పుష్పాలను గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ సమర్పించారు.
రత్నాల కంఠి, వరద హస్తాలు, 7 కిలోల రత్నాల మకర కంఠి, బంగారు వస్ర్తాలు స్వామికి కానుకగా అందాయి.
2009లో కర్ణాటకకు చెందిన పారిశ్రామికవేత్త గాలి జనార్దనరెడ్డి రూ.42 కోట్ల విలువ చేసే వజ్రాల కిరీటాన్ని స్వామికి సమర్పించారు..
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ ప్రభుత్వం తరఫున రూ.5.2 కోట్ల విలువైన 19.072 కిలోల బరువున్న రెండు స్వర్ణాభరణాలు అందజేశారు.
అమెరికాలో నివాసముంటున్న రామలింగరాజు ఇచ్చిన విరాళంతో రూ.11 కోట్ల వ్యయంతో నూతన సహస్రనామ కాసుల బంగారు హారాన్ని తయారుచేసి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా స్వామివారికి అందజేశారు.
లలిత్ బాసిన్ బంగారు గంగాళం, పాత్రలు ఇచ్చారు.
మాజీ ఎంపీ మేకపాటి రాజమెహన్‌రెడ్డి 20 కేజీల మూలవర్ల బంగారు పీతాంభరాలు బహూకరించారు.
2003లో 108 బంగారు పుష్పాలను లలిత జ్యూవెలరీ అధినేత కిరణ్ అందజేశారు.
2021లో ఎం అండ్ సీ ప్రాపర్టీస్ సంస్థ 3.604 కేజీల బంగారు బిస్కెట్లు విరాళంగా ఇచ్చింది. అదే ఏడాది ఓ ఆజ్ఞాత భక్తుడు 5.3 కిలోల బరువైన బంగారు కఠి, వరద హస్తాలను అందజేశారు.
తమిళనాడుకు చెందిన తంగదొరై పలుమార్లు విలువైన బంగారు ఆభరణాలను సమర్పించారు.
గతేడాది మే నెలలో సంజీవ్ గోయంకా బంగారు కఠి, వరద హస్తాలను కానుకగా ఇచ్చారు.
శ్రీవారి ఆభరణాలివీ...
స్వామికి రత్నఖచిత, వజ్ర వైడూర్యాలు పొదిగిన బంగారు ఆభరణాలు ప్రతివారం అభిషేకం తరువాత అలంకరిస్తుంటారు. నిత్యాభరణాలుగా పిలిచే వజ్రాల శంఖుచక్రాలు, రత్నాల శంఖుచక్రాలు, రత్నాల కర్ణపత్రాలు, రత్నాల మకరకంఠి, రత్నాల కటి హస్తం, రత్నాల వైకుంఠ హస్తం, స్వర్ణ పద్మపీఠం, స్వర్ణ పాదాలు, అష్టోత్తర శతనామ హారం, సమస్రనామం, సూర్య కఠారి, కడియాలు, కర భూషణాలు, భుజదండ భూషణాలు, నాగాభరణాలు, భుజకీర్తులు, సాలిగ్రామ హారం, తిరుక్కాళం, ఆకాశరాజు కిరీటం, వజ్ర అశ్వత్థపత్ర హారం, ముఖ పట్టీ, ఐదు పేటల కంఠి, చంద్రవంక కంఠి, పాగడాలు, కాంచీగునం, అంకెలు, వడ్డాణాలు, గోపు హారం, స్వర్ణ యజ్ఞోపవీతం, తులసీ పత్రహారం, పులిగోరు హారం ఇలా చాలానే నిత్యాభరణాలుగా ఉన్నాయి. వీటిలో సహస్రనామ మాల, లక్ష్మీహారం, పచ్చ పొదిగిన కంఠాభరణం, వక్షస్థల లక్ష్మి, లక్ష్మీ హారాలు, సాలగ్రామ హారం శ్రీవారిపై ఉంటాయి. మిగిలిన ఆభరణాలు మూడు జతలకు పైగా ఉండటంతో టీటీడీ వాటిని అవసరాలకు అనుగుణంగా మార్పిడి చేస్తుంటుంది. తాజా విరాళంతో శ్రీవారి అలంకరణకు మరో సెట్ జత కానుంది.
ఈ వార్తలనూ చదవండి:
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్