ఎట్టకేలకు.. ఏడేళ్లకు!
ABN , Publish Date - Nov 16 , 2026 | 04:41 AM
ఎట్టకేలకు.. దాదాపు ఏడేళ్ల తర్వాత తిరుమలలోని ఎస్వీ మ్యూజియం తిరిగి భక్తుల సందర్శనకు సిద్ధమైంది.
ఆధునికీకరణ పేరిట మూసివేసిన గత ప్రభుత్వం
ప్రత్యేక శ్రద్ధతో పునర్నిర్మించిన కూటమి సర్కారు
కొలువుదీరిన 8 వేల పురాతన కళాఖండాలు
టాటా కన్సల్టెన్సీ అత్యాధునిక సాంకేతిక సహకారం
విశ్వం, సృష్టి రహస్యాలతో ‘బ్రహ్మాండం’ ప్రదర్శనలు
నేటి నుంచి భక్తులను అనుమతించనున్న టీటీడీ
తిరుమల, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు.. దాదాపు ఏడేళ్ల తర్వాత తిరుమలలోని ఎస్వీ మ్యూజియం తిరిగి భక్తుల సందర్శనకు సిద్ధమైంది. ఆధునికీకరణ పేరుతో గత ప్రభుత్వంలో మూతబడిన ఈ మ్యూజియంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపి.. పనుల్లో వేగాన్ని పెంచి భక్తుల సందర్శనకు తిరిగి సిద్ధం చేసింది. అత్యాధునిక టెక్నాలజీని జత చేసి విలువైన చారిత్రక సంపదను భక్తకోటికి చూపేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. అపురూపమైన శిల్పకళ సంపద, పురాతన వాయిద్యాలు, ఆయుధాలు, పూజాసామగ్రి, ఆభరణాలు, ఆలయ నిర్మాణం వంటి వాటిని ప్రదర్శించేందుకు ఎస్వీ మ్యుజియం సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విశ్వ రహస్యాలను పరిచయం చేసేలా మ్యూజియాన్ని అందంగా తీర్చిదిద్దారు.
సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తులుగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సాంకేతిక సహకారంతో రూపొందించిన ఈ మ్యూజియంలో 14 ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. సుమారు 8వేలకుపైగా పురాతన కళాఖండాలు, చారిత్రక వస్తువులు, శిల్పాలు, అరుదైన సంపదతోపాటు డిజిటల్ ప్రదర్శనలు సందర్శకులను కనువిందు చేయనున్నాయి. శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యరూపం, ఆలయ చరిత్ర, భారతీయ శిల్పకళ, దేవాలయ నిర్మాణ వైభవం, సంగీతం, నృత్యం, పూజా సంప్రదాయాలు, పురాతన ఆయుధాలు ఇలా విభిన్నమైన అంశాలు ఉన్నాయి.
ప్రత్యేకించి స్టోన్ స్కల్ప్చర్, బ్రాంజ్ స్కల్ప్చర్ గ్యాలరీలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. తిరుమల ఆలయ నిర్మాణ చరిత్ర, దాని పరిణామ క్రమం, దాతలు అందించిన కానుకలు, పూజా విధానాలకు సంబంధించిన అంశాలను కళ్లకు కట్టినట్టు స్క్రీన్‌పై ప్రదర్శించనున్నారు. అన్నమయ్య కీర్తనల రేకులు, నాణేల చరిత్ర కూడా తెలుసుకోవచ్చు.
ప్రత్యేక ఆకర్షణగా ‘బ్రహ్మాండం’
ఈ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణ ‘బ్రహ్మాండం’ గ్యాలరీ. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రూపొందించిన ఈ గ్యాలరీలో విశ్వం, సృష్టి రహస్యాలు, బ్రహ్మాండం విస్తృతి వంటి అంశాలను వినూత్నంగా ఆవిష్కరించారు. హోలోగ్రాఫిక్ ప్రదర్శనలు, 360 డిగ్రీల సౌండ్ అనుభూతి, డిజిటల్ విజువల్స్ వంటి ఆధునిక సాంకేతికతో సందర్శకులకు సరికొత్త అనుభవాన్ని అందించనున్నారు. దాదాపు రూ.వంద కోట్లకుపైగా టాటా సంస్థ ఇచ్చిన విరాళంతో ఈ మ్యూజియంను అభివృద్ధి చేయగా, ఈ ఏడాది సెప్టెంబరు 16వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. టీటీడీ పదిరోజులుగా టీటీడీ ఉద్యోగులు, శ్రీవారిసేవకులు, మీడియా, విద్యార్థులతో ట్రయల్‌రన్ నిర్వహిస్తోంది. సోమవారం నుంచి భక్తులందరికీ రూ. 50 ప్రవేశ రుసుముతో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరక్చు అనుమతించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు
ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!