Share News

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

ABN , Publish Date - Oct 01 , 2026 | 04:25 AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులతో పాటు పెరటాశి మూడో శనివారం కావడంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. రద్దీ పెరుగుతున్న క్రమంలో క్యూలైన్‌లోకి భక్తులను విడతలవారీ అనుమతించారు.

 తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

  • సర్వదర్శనానికి 20 గంటలు

  • దర్శనానికి అనుమతించాలని భక్తుల నిరసనలు

తిరుమల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులతో పాటు పెరటాశి మూడో శనివారం కావడంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. రద్దీ పెరుగుతున్న క్రమంలో క్యూలైన్‌లోకి భక్తులను విడతలవారీ అనుమతించారు. మంగళవారం రాత్రి 10 గంటలకు క్యూలైన్‌ మూసివేసి తిరిగి ఒంటిగంట నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. బుధవారం కూడా క్యూలైన్‌ నిండిన వెంటనే ప్రవేశాన్ని మూసివేస్తూ, ఖాళీ అయిన వెంటనే తిరిగి అనుమతించారు. తమిళనాడు భక్తబృందం తమను దర్శనానికి అనుమతించాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కొందరు భక్తులు డీటైప్‌ క్వార్టర్స్‌ వద్ద రోడ్డుపై నిరసనకు దిగారు.

మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసింది. అయితే బుధవారం ఉదయం సిఫారసు లేఖలతో అదనపు ఈవో కార్యాలయానికి కొందరు భక్తులు రాగా... సిఫారసు లేఖలు తీసుకోబోమని సిబ్బంది చెప్పారు. ఈక్రమంలో కొందరు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. దీంతో సిఫారసు లేఖలతో వచ్చిన వారికి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు కేటాయించి పంపారు. కాగా, బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్‌ అక్టోపస్‌ భవనం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వీరికి దాదాపు 20 గంటల దర్శన సమయం పడుతోంది.

ఈ వార్తలనూ చదవండి...

ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’

రైతులకు తీపి కబురు

Updated Date - Oct 01 , 2026 | 04:25 AM