కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై తిరుమలేశుడి విహారం
ABN , Publish Date - Oct 16 , 2026 | 03:48 AM
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు గురువారం ఉదయం కల్పవృక్ష, రాత్రి సర్వభూపాల వాహనాలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.
తిరుమల, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు గురువారం ఉదయం కల్పవృక్ష, రాత్రి సర్వభూపాల వాహనాలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఉదయం బకాసుర వధ అలంకారంలో మలయప్ప స్వామి దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. నల్లటి మేఘాల నడుమ వాహనసేవ ప్రారంభమవగా, మాడవీధుల్లోని వాయవ్యదిశకు రాగానే చిరుజల్లులు మొదలయ్యాయి. అనంతరం అధికారులు ఉత్సవమూర్తులు తడిచిపోకుండా ఘటాటోపం నీడన వాహనసేవను ముందుకు నడిపారు. కల్పవృక్ష వాహన సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ పాల్గొన్నారు. రాత్రి కూడా వర్షం కురవడంతో ఘటాటోపం నీడన సర్వభూపాల వాహన సేవ వైభవంగా జరిగింది.
నేడు గరుడ వాహనసేవ
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడ వాహనసేవ శుక్రవారం జరగనుంది. సాయంత్రం 6.30 గంటలకు వాహన సేవ ప్రారంభించి భక్తులకు సంతృప్తికరమైన దర్శనం చేయించాలని టీటీడీ అధికారులు ప్రణాళిక రూపొందించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో తొలి నాలుగు రోజులు భక్తుల రద్దీ సాధారణంగానే ఉన్నప్పటికీ పెరటాశి చివరివారం కావడంతో గరుడోత్సవానికి భక్తులు భారీగా వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు