Share News

జనావాసాల్లోకి పులి!

ABN , Publish Date - Nov 16 , 2026 | 05:11 AM

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల వాసులు పులి సంచారంతో భయాందోళనలకు గురవుతున్నారు.

జనావాసాల్లోకి పులి!

  • జీలుగుమిల్లిలో ఆదివారం తెల్లవారుజామున సంచారం

  • కారులో వెళ్తున్న వ్యక్తి చూసి గ్రామస్థులకు సమాచారం

జీలుగుమల్లి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల వాసులు పులి సంచారంతో భయాందోళనలకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం బొత్తప్పగూడెం, జిల్లేళ్లగూడెం, రాచన్నగూడెం అడవుల్లో సంచరించిన పులి ఆదివారం తెల్లవారు జామున జీలుగుమిల్లిలో జనవాసాల మధ్య సంచరిస్తూ వెళ్లింది. గ్రామ ప్రధాన నాలుగు రోడ్ల కూడలి జగదాంబ ఆలయానికి కూతవేటు దూరంలో కారులో ప్రయాణిస్తున్న పి.రాజవరానికి చెందిన బాబురావు కారుకు పులి ఎదురు పడింది. హారన్‌ కొట్టటంతో కారు ముందు నుంచి దూకి సమీప ఇంటి ఆవరణలోకి పరుగు తీసింది.

వెంటనే ఆయన గ్రామంలో తనకు తెలిసిన వారికి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామంలో ఒకరి నుంచి ఒకరికి నిమిషాల్లోనే పులి సమాచారం చేరడంతో అంతా అప్రమత్తమయ్యారు. పులి కనిపించిన ప్రాంతంలోని కిరాణా దుకాణం బయట ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా పులి కదలికలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. తెల్లారిన తర్వాత గ్రామస్థులు, అటవీశాఖ అధికారులు పరిశీలించగా పులి సంచరించిన ప్రాంతంలో పాదముద్రలు ఖాళీగా ఉంటున్న ఓ ఇంటి వద్ద, కొప్పుల మోహన్‌రావు ఇంటి వద్ద కన్పించాయి.

జీలుగుమిల్లి నుంచి చంద్రమ్మకాలనీ అటవీ ప్రాంతం వైపు పులి వెళ్లినట్టు గుర్తించి, అటవీశాఖ అధికారులు ఆదిశగా గాలింపు చేపట్టారు. ఆదివారం రోజంతా పి.రాజవరం-చంద్రమ్మకాలనీ అటవీ ప్రాంతంలోనే మకాం వేసిన పులి ఆదివారం రాత్రికి టి.నరసాపురం మండలం మర్రిగూడెం మీదుగా తెలంగాణ ప్రాంతం దమ్మపేట పరిధిలోని అటవీప్రాంతానికి చేరినట్టు జీపీఎస్‌ ట్రాకర్‌ ద్వారా గుర్తించినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. పులి సంచారం పసిగట్టేందుకు జంగారెడ్డిగూడెం రేంజ్‌ అధికారి దుర్గాకుమార్‌బాబు, ఎఫ్ఎస్‌వో రాంబాబు, ఎఫ్‌బీబో మారేష్‌ ఇతర సిబ్బంది, పశువైద్యులు రోజంతా అడవిలో తిరిగారు.

ఈ వార్తలనూ చదవండి:

సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు

ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!

Updated Date - Nov 16 , 2026 | 05:15 AM