Share News

అదిగో పులి!

ABN , Publish Date - Nov 18 , 2026 | 01:26 AM

దాదాపు ఆరు నెలల నుంచి జనాన్ని వణికిస్తున్న పెద్దపులి మొత్తంగా ఇప్పుడు ఏలూరు జిల్లాను చుట్టేస్తోంది.

అదిగో పులి!

  • ఏలూరు జిల్లాను చుట్టేస్తున్న పెద్దపులి

  • మల్లేశ్వరం మామిడి తోటలో మకాం

  • జీపీఎస్‌ ట్రాకర్‌ ద్వారా కదలికల గుర్తింపు

  • గ్రామాల్లో టెన్షన్‌ టెన్షన్‌

లింగపాలెం/చాట్రాయి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): దాదాపు ఆరు నెలల నుంచి జనాన్ని వణికిస్తున్న పెద్దపులి మొత్తంగా ఇప్పుడు ఏలూరు జిల్లాను చుట్టేస్తోంది. తొలుత వేలేరుపాడు, జీలుగుమిల్లి, చింతలపూడి, చాట్రాయి మండలాలను చుట్టుముట్టి ప్రస్తుతం లింగపాలెం మండలం సింగగూడెం శివారు మల్లేశ్వరం చేరుకుని అక్కడి మామిడితోటలో బస చేసింది. సోమవారం రాత్రి చాట్రాయి మండలంలోకి పులి ప్రవేశించడంతో సమీప గ్రామాల ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. పులి మెడలో ఉన్న జీపీఎస్‌ ట్రాకర్‌ ఆధారంగా దాని కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతున్న అటవీ, పోలీసు శాఖల అధికారులు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. చింతలపూడి మండలం చింతంపల్లి, రాఘవాపురం, డీఎన్‌ రావుపేట, పోతునూరు మీదుగా సోమవారం రాత్రి పది గంటల సమయంలో పులి చాట్రాయి మండలంలోకి ప్రవేశించి.. మల్లేశ్వరం చేరుకుని అక్కడి మామిడితోటలో మకాం వేసిందని ఏలూరు రేంజ్‌ ఆఫీసర్‌ ఎస్‌వీకే కుమార్‌ నిర్ధారించారు.


మైక్‌ల ద్వారా దండోరా..

పులి సంచారం నేపథ్యంలో నూజివీడు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సత్యనారాయణ, ఎస్సై డి.రామకృష్ణ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చిన్నంపేట, కోటపాడు, పోతనపల్లి, పోలవరం గ్రామాల్లో రాత్రికి రాత్రే మైక్‌ల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు. రైతులు, ప్రజలు ఎవరూ పొలాల్లోకి, అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, పశువులను మేతకు బయటకు వదలవద్దని హెచ్చరించారు. పులి కదలికలపై సిబ్బంది నిరంతరం నిఘా ఉంచారు. రాత్రికి పులి ప్రస్తుతమున్న మామిడి తోట నుంచి మరో ప్రాంతానికి మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాత్రి వేళల్లో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఏలూరు రేంజ్‌ ఆఫీసర్‌ ఎస్‌వీకే కుమార్‌ సూచించారు.

ఈ వార్తలనూ చదవండి:

పరీక్షల పరేషాన్‌

అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Updated Date - Nov 18 , 2026 | 01:30 AM