వరహా నదిలో ముగ్గురు గల్లంతు
ABN , Publish Date - Nov 15 , 2026 | 04:32 AM
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు వద్ద వరహా నదిలో ఈతకు వెళ్లిన వారిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మరో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు.
ఈత కొట్టడానికి దిగి మునక
ఎస్.రాయవరం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు వద్ద వరహా నదిలో ఈతకు వెళ్లిన వారిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మరో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ప్రమాదం నుంచి బయటపడిన యువకులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెనుగొల్లు దళిత కాలనీకి చెందిన ముప్పిడి నాగవంశీ (22), కోడి జగదీశ్ (20), కాతేటి రిషి (18)తోపాటు మరో ముగ్గురు యువకులు కలిసి శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న వరహా నది గ్రోయిన్ వద్దకు వెళ్లారు.
గ్రోయిన్‌కు దిగువన నదిలో ఈత కొట్టడానికి తొలుత నాగవంశీ, జగదీశ్, రిషి నీటిలో దిగారు. వారి వెనుక మిగిలిన ముగ్గురు నదిలో దిగారు. ముందు వెళుతున్న ముగ్గురూ ఒక్కసారిగా నీటిలో మునిగిపోవడంతో మిగిలినవారు భయంతో గ్రోయిన్ గట్టు వద్దకు వచ్చేశారు. ప్రమాదం జరిగిన చోట సుమారు 20 అడుగుల మేర లోతు ఉండడం, బాగా ఈత వచ్చిన వారు ఎవరూ లేకపోవడంతో నీట మునిగిన వారిని కాపాడలేకపోయారు. సమాచారం అందుకున్న డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీఐ ఎల్. రామకృష్ణ, ఎస్‌ఐ రమేశ్, పోలీసులు గ్రోయిన్ వద్దకు చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి చీకటి పడడంతో గాలింపు చర్యలు చేపట్టలేదు. ప్రాథమికంగా మిస్సింగ్ కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ రమేశ్ తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం