కర్ణాటకలోని తుమ్కూరు సమీపంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి..
ABN , Publish Date - Jun 04 , 2026 | 08:48 PM
కర్ణాటకలోని తుమ్కూరు సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..
కర్నూలు, జూన్ 04: కర్ణాటక రాష్ట్రం తుమ్కూరు సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదోనికి చెందిన కుటుంబ సభ్యులు మైసూర్ నుంచి తమ స్వగ్రామమైన ఆదోనికి ఇన్నోవా కారులో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో తుమ్కూరు సమీపంలోకి రాగానే వీరి ఇన్నోవా వాహనాన్ని.. ఓ వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తీవ్రతకు ఇన్నోవా కారు పూర్తిగా ధ్వంసమైంది.
ఈ దారుణ ఘటనలో ఆదోనికి చెందిన గజేశ్వర్ రెడ్డి, ఇందిర, సౌమ్య తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యం కోసం వెంటనే బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కర్ణాటక పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రెండేళ్లలో ఏం చేశామో ప్రజలకు వివరించండి.. మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం
బలమైన భారత్ కోసం యువత ఎదురుచూపు: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News