పదడుగులకో జిల్లా!
ABN , Publish Date - Nov 16 , 2026 | 04:53 AM
జిల్లాల సరిహద్దు అనేసరికి శివారున నదులో.. పెద్దపెద్ద కాలువలో ఉంటాయి. గ్రామాలు దూరంగా ఉంటాయి! కానీ.. కృష్ణానది. లంక గ్రామాలకు ఓ ప్రత్యేకత ఉంది.
పక్కపక్కనే 3 గ్రామాలు.. 3 జిల్లాల్లో!
గ్రామంలోని రహదారులే సరిహద్దులు
కృష్ణా నది లంక గ్రామాల ప్రత్యేకత
వేర్వేరు తేదీల్లో పంచాయతీ ఎన్నికలు
కొల్లూరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాల సరిహద్దు అనేసరికి శివారున నదులో.. పెద్దపెద్ద కాలువలో ఉంటాయి. గ్రామాలు దూరంగా ఉంటాయి! కానీ.. కృష్ణానది. లంక గ్రామాలకు ఓ ప్రత్యేకత ఉంది. లంకలోని ఓ రహదారికి అటూ ఇటు రెండు గ్రామాలు.. అదే రోడ్డుకు మూలమలుపున మరో గ్రామం ఉండగా.. వాటి మధ్య దూరం పట్టుమని పదడుగుల దూరం కూడా ఉండదు కానీ.. ఈ మూడు గ్రామాలు మూడు జిల్లాల పరిధిలో ఉండడం విశేషం. వివరాలివీ.. ఈ లంక గ్రామాలకు బాపట్ల జిల్లా కొల్లూరు మండలం నుంచి వెళ్లేందుకు ఏకైక రహదారి ఉండగా, 20 ఏళ్ల క్రితం నిర్మించిన అరవింద వారధితో ఆ గ్రామాలకు రహదారులు ఏర్పడ్డాయి.
అంతకు ముందు 9 లంక గ్రామాల ప్రజలు కృష్ణా, గుంటూరు జిల్లాల వైపు వెళ్లాలంటే పడవలను ఆశ్రయించాల్సి వచ్చేది. ప్రస్తుతం రహదారి వల్ల పడవలతో పని లేకుండా పోయింది. వీటిలో మూడు గ్రామాలు మాత్రం కేవలం రహదారులే సరిహద్దులుగా ఉన్నాయి. చిలుమూరులంక బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, కొల్లూరు మండలంలో ఉండగా, అన్నవరపు లంక గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో ఉంది. కనిగిరిలంక గ్రామం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలంలో ఉంది. కేవలం 2, 3 వేల గడపలుండే ఈ మూడు గ్రామాలు మూడు జిల్లాలు, మూడు నియోజకవర్గాలలో ఉండటం గమనార్హం.
ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో కృష్ణా జిల్లా అధికారులు ఐలూరు గ్రామ పంచాయితీ శివారు గ్రామం కనిగిరిలంక రావాలంటే పడవలను ఆశ్రయించి నది దాటి రావాల్సి ఉంది. లేదంటే పెనుమూడి బ్రిడ్జి మీదుగా కొల్లూరు చేరుకుని అక్కడి నుంచి రావాల్సి ఉంటుంది. అన్నవరపు లంకకు రావాలంటే ఇటీవల కృష్ణానదికి వచ్చిన వరదలకు ముందు అన్నవరపు లంక వద్ద గాలు మార్గం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వరద నీటికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
పడవల ద్వారా అధికారులు వెళ్లాల్సి ఉంది. లేదంటే కొల్లూరు నుంచి ఆ గ్రామానికి వాహనాల ద్వారా చేరుకోవచ్చు. చిలుమూరు గ్రామ పంచాయతీలో ఉన్న చిలుమూరులంక వెళ్లాలంటే అరవింద వారధి దాటి వెళ్లాల్సి ఉంది. చిలుమూరులంక, కనిగిరిలంకలలో ఈ నెల 29వ తేదీన, అన్నవరపు లంకలో డిసెంబరు 2ఎన్నికలు జరగనున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు
ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!