కావలిలో రచ్చరచ్చ!
ABN , Publish Date - Nov 18 , 2026 | 02:22 AM
నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన కేంద్రం వద్ద మంగళవారం కూటమి, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాటతో ఉద్రిక్తత నెలకొంది.
నామినేషన్ల పరిశీలనలో తోపులాట
కూటమి, వైసీపీ వర్గాల వాగ్వాదం
బయటకు వెళ్లమన్న డీఎస్పీపై మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ఆగ్రహం
పోలీసులు వైసీపీకే సహకరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి మండిపాటు
పరిశీలన కేంద్రంలోకి రౌడీషీటర్లను ఎలా అనుమతిస్తారంటూ జిల్లా ఎస్పీకి ఫోన్
ఎస్పీ ఆదేశాలతో కావలికి తరలిన పోలీసు అధికారులు
ఇరువర్గాలనూ చెదరగొట్టిన వైనం
కావలి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన కేంద్రం వద్ద మంగళవారం కూటమి, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాటతో ఉద్రిక్తత నెలకొంది. కావలి మున్సిపల్ ఆరో వార్డు వైసీపీ అభ్యర్థిని మక్కె దుర్గాభవాని నామినేషన్ అసంపూర్తిగా ఉండడంతో దానిపై టీడీపీ అభ్యర్థిని ప్రపోజర్ జనిగర్ల మహేంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆమె నామినేషన్‌ను అధికారులు పక్కన పెట్టారు. వైసీపీ నేతలు బయటకు వచ్చి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్పకుమార్రెడ్డికి ఫోన్ చేశారు. ఆయన మందీమార్బలంతో అక్కడకు వచ్చి నేరుగా పరిశీలన కేంద్రంలోకి వెళ్లారు.
అక్కడే ఉన్న కూటమి చైర్మన్ అభ్యర్థి భరత్‌కుమార్.. తలుపు నెట్టుకుని లోపలకు వెళ్లి రామిరెడ్డిని నిలదీశారు. దీంతో కూటమి, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో వైసీపీ నేతలు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకుని అధికారులపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కూటమి నేతలు వారిని ప్రతిఘటించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
రామిరెడ్డిని బయటకు పంపేందుకు డీఎస్పీ రమణ కుమార్ ప్రయత్నించగా.. చేయి తీయ్ అంటూ ఆయన గద్దించారు. మున్సిపల్ ఆఫీసు ఆవరణ నుంచి బయటకు వెళ్లేందుకు ఇరు వర్గాలూ మొండికేయడంతో డీఎస్పీ ఆగ్రహించారు. ఇక్కడ గలభా సృష్టిస్తే పోలింగ్ రోజు పోలీసుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. అవసరమైతే గలభా సృష్టించిన వారిని గృహనిర్బంధం చేస్తామన్నారు. ఇంతలో టీడీపీ ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అక్కడకు వచ్చారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అందరినీ బలవంతంగా బయటకు పంపారు.
సెలవు పెట్టి వైసీపీకి సహకరించండి..: ఎమ్మెల్యే
ప్రశాంతంగా నామినేషన్ల పరిశీలన జరుగుతుండగా.. సదరు కేంద్రం వద్ద అలజడి రేగడానికి పోలీసుల వైఫల్యమే కారణమని ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి ఆరోపించారు. ఎస్పీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ‘వైసీసీపై పోలీసులకు ప్రేమ ఉంటే సెలవు పెట్టి సహకరించండి. పోలీసులు బైండోవర్ చేసుకున్న రౌడీషీటర్లను నామినేషన్ల పరిశీలన కేంద్రంలోకి ఎలా అనుమతించారు? వారికి ఎంతకు అమ్ముడుపోయారు? అభ్యర్థులు, వారి ప్రపోజర్లకు మాత్రమే అనుమతి ఉన్న కేంద్రంలోకి మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు, రౌడీ షీటర్లు ఎలా వచ్చారు...?
అధికారంలో ఉండి కూడా మేం లోపలకు రావడానికి వెనుకాడుతుంటే, వారిని ఎవరు అనుమతించారో తేల్చాలి’ అని డిమాండ్ చేశారు. దీంతో రూరల్ మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద మోహరించిన పోలీసు అధికారులను.. తక్షణమే కావలి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాలని ఎస్పీ ఆదేశించారు. వారు హుటాహుటిన అక్కడకు చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు