Share News

సాలూరులో వైసీపీతో చేతులు కలిపిన జనసేన

ABN , Publish Date - Nov 24 , 2026 | 05:57 AM

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో జనసేన, వైసీపీతో చేతులు కలిపి భంగపడింది. ఇక్కడ జనసేనకు చెందిన పి.విజయకుమారి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

సాలూరులో వైసీపీతో చేతులు కలిపిన జనసేన

  • మంత్రి గుమ్మిడి కౌంటర్‌ ప్లాన్‌.. వైస్‌ చైర్మన్‌ను దక్కించుకున్న టీడీపీ

పార్వతీపురం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో జనసేన, వైసీపీతో చేతులు కలిపి భంగపడింది. ఇక్కడ జనసేనకు చెందిన పి.విజయకుమారి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. కూటమి ఒప్పందంలో భాగంగా వైస్‌ చైర్మన్‌ పదవిని టీడీపీకి కేటాయించారు. అయితే సోమవారం జనసేన నుంచి గేదెల లావణ్య అనూహ్యంగా బరిలోకి దిగారు. టీడీపీ అభ్యర్థిగా పి.మోహన్‌ నిలబడ్డారు. టీడీపీకి చెందిన 11 మంది, బీజేపీ నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్రులు, మంత్రి సంధ్యారాణి... తొలుత మొత్తం 15 ఓట్లు మోహన్‌కు ఉన్నాయి. మంత్రి మంత్రాంగంతో వైసీపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు ఆయనకు మద్దతు ప్రకటించారు. టీడీపీ అభ్యర్థికి 18 మంది మద్దతు లభించింది. జనసేన లావణ్యకు 9 మంది వైసీపీ కౌన్సిలర్లు, నలుగురు జనసేన కౌన్సిలర్లు, ఒక స్వతంత్ర కౌన్సిలర్‌, చైర్‌పర్సన్‌ విజయకుమారి మొత్తం 15 మంది మద్దతు లభించింది. దీంతో మోహన్‌ వైస్‌ చైర్మన్‌గా విజయం సాధించారు.

పార్వతీపురం మునిసిపాలిటీలో బీజేపీకి వైస్‌ చైర్‌పర్సన్‌

పార్వతీపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన బెలగాం కరుణతోపాటు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కూటమి ఒప్పందంలో భాగంగా బీజేపీకి చెందిన ఏకైక కౌన్సిలర్‌ పార్వతి వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. పాలకొండ నగర పంచాయతీలో జనసేనకు చెందిన పి.విజయనిర్మల చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వైస్‌ చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన గుమ్మిడి దమయంతితోపాటు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 05:59 AM