Share News

ఒక్క ఓటుతో వైస్‌ చైర్మన్‌

ABN , Publish Date - Nov 24 , 2026 | 06:28 AM

నంద్యాల మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఉత్కంఠగా సాగింది. 52 వార్డుల్లో టీడీపీ-24, వైసీపీ-27, బీజేపీ-1 చొప్పున గెలుపొందిన విషయం తెలిసిందే.

ఒక్క ఓటుతో వైస్‌ చైర్మన్‌

  • నంద్యాలలో టీడీపీ వశమైన పీఠం

  • కీలకంగా మారిన మున్సిపల్‌ చైర్మన్‌ ఓటు

నంద్యాల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): నంద్యాల మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఉత్కంఠగా సాగింది. 52 వార్డుల్లో టీడీపీ-24, వైసీపీ-27, బీజేపీ-1 చొప్పున గెలుపొందిన విషయం తెలిసిందే. సోమవారం వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కార్యక్రమానికి ఆయా వార్డు సభ్యులతో పాటు చైర్మన్‌ డాక్టర్‌ బాబన్‌(టీడీపీ), మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, ఎంపీ బైరెడ్డి శబరి, వైసీపీ ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా కూడా హాజరయ్యారు. వైస్‌ చైర్మన్‌ బరిలో టీడీపీ నుంచి 11వ వార్డు కౌన్సిలర్‌ ఉప్పర సుబ్రహ్మణ్యం, వైసీపీ నుంచి 48వ వార్డు కౌన్సిలర్‌ రాజశ్వేరి నిలిచారు. 32వ వార్డులో వైసీపీ నుంచి గెలుపొందిన సరోజమ్మ గైర్హాజరయ్యారు.

దీంతో బీజేపీ కౌన్సిలర్‌తో పాటు ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్‌ అఫిషియో ఓట్లతో టీడీపీ బలం 27కు చేరుకుంది. ఎక్స్‌ అఫిషియో హోదాలో ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషా ఓటుతో వైసీపీ బలం కూడా 27కు చేరగా, ఇరు పార్టీలకు సమాన ఓట్లు రావడంతో మున్సిపల్‌ చైర్మన్‌ ఓటు కీలకంగా మారింది. చైర్మన్‌ బాబన్‌ టీడీపీ అభ్యర్థి వైపే మొగ్గు చూపడంతో ఒక్క ఓటుతో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పీఠం టీడీపీ వశం అయింది. టీడీపీ అభ్యర్థికి 28, వైసీపీ అభ్యర్థికి 27 ఓట్లు రావడంతో వైస్‌ చైర్మన్‌ పదవి టీడీపీ వశమైంది.


ఆళ్లగడ్డ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా

ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో సోమవారం ప్రమాణ స్వీకారంతో పాటు వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించారు. దీనికి 32మంది కౌన్సిలర్లతో పాటు చైర్మన్‌ షేక్‌ అనీషా(టీడీపీ), ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హాజరయ్యారు. టీడీపీ నుంచి గెలిచిన 22 మంది, వైసీపీ నుంచి గెలిచిన 8 మంది, జనసేన నుంచి గెలిచిన ఇద్దరు, ఎమ్మెల్యే (ఎక్స్‌ అఫిషియో) కూడా రావడంతో కూటమికి-25, వైసీపీ-8 చొప్పున బలం ఉంది. పూర్తి స్థాయి ఆధిక్యం ఉన్నప్పటికీ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా కావడం చర్చనీయాంశమైంది. కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేసి బయటకు వెళ్లిపోవడంతో వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా పడింది.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 06:29 AM