Share News

జగన్‌ ఊసరవెల్లి!

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:55 AM

జగన్‌ రెడ్డి మాటల్లో ఆత్మస్తుతి, పరనింద మాత్రమే కనిపిస్తున్నాయని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

జగన్‌ ఊసరవెల్లి!

  • మాటలు మార్చడంలో దాన్ని మించిపోయారు

  • ప్రజాతీర్పును గౌరవించడం ఆయన డీఎన్‌ఏలోనే లేదు

  • ఓటు వేయని జగన్‌కు ఎన్నికలపై మాట్లాడే హక్కులేదు: ధూళిపాళ్ల

అమరావతి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జగన్‌ రెడ్డి మాటల్లో ఆత్మస్తుతి, పరనింద మాత్రమే కనిపిస్తున్నాయని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మాటలు మార్చడంలో జగన్‌ రంగులు మార్చే ఊసరవెల్లిని మించిపోయారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ఈవీఎంల వల్లే గెలిచారని ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు బ్యాలెట్‌ ద్వారా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు చేసి గెలిచారని చెప్పడం ఆయనకు ప్రజల తీర్పుపై ఏమాత్రం గౌరవం ఉందో చెబుతుందన్నారు. ప్రజాతీర్పును గౌరవించడం జగన్‌ డీఎన్‌ఏలోనే లేదన్నారు. పోలింగ్‌ బూత్‌ వద్దకు వచ్చి ఓటు వేయకుండా వెనక్కి వెళ్లిన ఏకైక రాజకీయ నాయకుడు ఆయన ఒక్కడేనని ఎద్దేవా చేశారు.

ఓటు వేయని జగన్‌కు ఎన్నికలపై మాట్లాడే హక్కులేదన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు నిరాశతో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు జరిగితే అద్భుతమనడం, ఇప్పుడు ఏకగ్రీవాలు జరిగితే అరాచకాలనడం జగన్‌కే చెల్లుతుందన్నారు. ఆయన హయాంలో స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ను నిర్వీర్యం చేశారని విమర్శించారు. సాక్షాత్తూ అప్పటి ఎలక్షన్‌ కమిషనరే తనకు ప్రాణహాని ఉందని కేంద్రానికి లేఖ రాశారని, అంతటి అరాచకాన్ని సృష్టించిన జగన్‌ ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.


పులివెందుల, పలమనేరు, పుంగనూరు వంటి ప్రాంతాల్లో దశాబ్దాలుగా ధనబలం, కండబలంతో గుత్తాధిపత్యం సాగించిన వైసీపీ వారు ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయడానికి వస్తే దౌర్జన్యాలకు పాల్పడిన విషయం రాష్ట్రమంతా చూసిందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో రిగ్గింగ్‌, అరాచకాలు జరిగితే వైసీపీ వాళ్లు ఒక మేయర్‌ సహా ముగ్గురు చైర్‌పర్సన్లు ఎలా గెలిచారని ప్రశ్నించారు. వైసీపీ నమ్ముకున్నది విధ్వంసాన్ని అయితే తాము ప్రజలను నమ్ముకున్నామన్నారు. ఇప్పటికైనా వైసీపీ విధ్వంస బాటను వీడి ప్రజల్లోకి రావాలని, ప్రజాసమస్యలపై పోరాడాలని నరేంద్ర సూచించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 06:55 AM