Share News

పరిషత్‌లోనూ జైత్రయాత్ర

ABN , Publish Date - Nov 08 , 2026 | 05:32 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి జైత్రయాత్ర కొనసాగుతోంది. 12 కార్పొరేషన్లు, 82 పురపాల క సంస్థలను కైవసం చేసుకున్న కూటమి..

పరిషత్‌లోనూ జైత్రయాత్ర

  • స్థానిక ఎన్నికల్లో కొనసాగుతున్న కూటమి విజయపరంపర

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి జైత్రయాత్ర కొనసాగుతోంది. 12 కార్పొరేషన్లు, 82 పురపాల క సంస్థలను కైవసం చేసుకున్న కూటమి.. తాజాగా జడ్పీ, ఎంపీటీసీ స్థానాల్లోనూ విజయం సొంతం చేసుకుంది. వైసీపీకి ఒక్క అల్లూరి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పీఠం మాత్ర మే దక్కనుంది. మిగతా 27 జిల్లాల జడ్పీ చైర్‌పర్సన్‌ పదవు లూ కూటమి ఖాతాలో పడే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మాజీ సీఎం జగన్‌ సొంత జిల్లా కడపలో ఆ పార్టీ పరాజయం పరిపూర్ణమైంది. 39 జడ్పీటీసీలకు గాను వైసీపీ రెండు చోట్ల మాత్రమే గెలవగలిగింది.

ఉత్తరాంధ్ర కూటమిదే..

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో కూటమి సత్తా చాటింది. మన్యంలో వైసీపీ 5 జడ్పీటీసీలను గెలుచుకుని గట్టి పోటీ ఇచ్చినా.. చివరకు జడ్పీపీఠం కూటమికే దక్కింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ టీడీపీ-జనసేన-బీజేపీదే పైచేయి. వైసీ పీ సీనియర్‌ నేతలు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్‌, బొత్స సత్యనారాయణ ఉన్నా.. ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ జిల్లాలోని 542 ఎంపీటీసీలకు గాను కూట మి 434 చోట్ల గెలిచింది. విజయనగరంలోని 449 ఎంపీటీసీ స్థానాల్లో 318 కూటమి వశమయ్యాయి. ఇక్కడ వైసీపీ గట్టి పోటీ ఇచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని మొత్తం నాలుగు (ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి) జడ్పీటీసీలనూ కూటమి కైవసం చేసుకుంది.


భీమిలి, పద్మనాభం, పెందుర్తిల్లో టీడీపీ, ఆనందపురంలో జనసేన గెలుపొందింది. అలాగే ఈ జిల్లాలో 53 ఎంపీటీసీ స్థానాలకుగాను కూటమి 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేయగా వైసీపీ 16 చోట్ల మాత్రమే గెలువగలిగింది. ఆనందపురం మండలంలో కూటమికి, వైసీపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. చివరకు కూటమి 9, వైసీపీ 7 గెలుచుకున్నాయి. అనకాపల్లి జిల్లాలోని 24 జడ్పీటీసీ స్థానాలనూ కూటమి క్లీన్‌ స్వీప్‌ చేసేసింది. ఇక్కడ టీడీపీ టీడీపీ 17, జనసేన 5, బీజేపీ 2 స్థానాలు కైవసం చేసుకున్నాయి. జిల్లాలోని 427 ఎంపీటీసీ ల్లో కూటమి 392 గెలుచుకోగా.. వైసీపీ కేవలం 35 స్థానాల కే పరిమితమైంది.

అల్లూరి జిల్లాలో వైసీపీ ఆధిపత్యం నిలబెట్టుకుంది. మొత్తం 11 జడ్పీటీసీల్లో ఏడు చోట్ల గెలిచింది. టీడీపీ 3, సీపీఎం ఒకచోట గెలిచాయి. అల్లూరి జడ్పీ పీఠం వైసీపీకి దక్కనుంది. ఈ జిల్లా ఎంపీటీసీల్లో 172 స్థానాలకు గాను ఆ పార్టీ 102 చోట్ల విజయం సాధించింది. కూటమి పార్టీలు 53 స్థానాలకే పరిమితమయ్యాయి. ఇక్కడ ఇతరులు, స్వతంత్రులు 11 చోట్ల గెలిచారు. విశాఖలో 53 ఎంపీటీసీల్లో కూటమి 37 గెలుచుకోగా.. వైసీపీ మిగతా 16 స్థానాలను సొంతం చేసుకుంది.


గుంటూరు జడ్పీ.. కూటమి కైవసం

గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవిని కూటమి దక్కించుకుంది, మొత్తం 13 జడ్పీటీసీల్లో 11 కూటమి, 2 వైసీపీ గెలుచుకున్నాయి. టీడీపీ 9, జనసేన 2 చోట్ల విజ యం సాధించాయి. కొల్లిపరలో జనసేన, మేడికొండూరులో బీజేపీ అభ్యర్థిపై వైసీపీ విజయం సాధించింది. అలానే 200 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 122, జనసేన 34, బీజేపీ 1, వైసీపీ 31, ఇతరులు 5 చోట్ల గెలుపొందారు.

13 మండలా ల్లో మెజారిటీ ఎంపీటీసీ స్థానాలను కూటమి దక్కించుకోవడంతో అన్ని మండలాధ్యక్ష పదవులు దానికే దక్కనున్నాయి. పల్నాడులో మొత్తం 28 జడ్పీటీసీలకు గాను మొత్తాన్నీ కూటమే గెలుచుకుంది. 25 స్ధానాల్లో టీడీపీ.. 3 చోట్ల జనసేన అభ్యర్ధులు గెలుపొందారు. అలాగే 419 ఎంపీటీలకుగాను కూటమి పార్టీలు టీడీపీ 367, జనసేన 36, బీజేపీ ఒక స్ధానంలో.. వైసీపీ 12 చోట్ల విజయం సాధించాయి. బాపట్ల జిల్లా పరిషత్‌ పీఠం కూటమి ఖాతాలోనే పడింది. మొత్తం 20 జడ్పీటీసీలకు గాను కూటమి 17 గెలుపొందిం ది. 300 ఎంపీటీసీ స్థానాల్లో అర్ధరాత్రి వరకు కూటమి 239 చోట్ల గెలిచింది. వైసీపీ 38 స్థానాలకే పరిమితమైంది.

ప్రకాశంలో కూటమి జోరు

ప్రకాశం జిల్లాలోని 27 జడ్పీటీసీల్లో కూటమికి 25 రాగా.. వైసీపీకి రెండే దక్కాయి. 371 ఎంపీటీసీలకు గాను కూటమి 330 గెలుచుకుంది. వైసీపీ 37 స్థానాలకే పరిమితమైంది. మార్కాపురంలో మొత్తం 21 సీట్లనూ కూటమి కైవసం చేసుకుంది. జిల్లాలోని 274 ఎంపీటీసీల్లో కూటమి ఏకంగా 259 గెలుచుకుంది. వైసీపీ 14 స్థానాలతో చతికిలపడింది.

ఇక వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ ఉన్న యర్రగొండపాలెంలో మొత్తం 75 ఎంపీటీసీలకుగాను 67 చోట్ల కూటమి విజయం సాధించింది. జడ్పీటీసీలో కూడా పాగా వేసింది. పోలింగ్‌లో వైసీపీ అభ్యర్థిని ఓడించి టీడీపీ గెలుపొందటం గత దశాబ్ధన్నర కాలం తర్వాత ఇదే ప్రథమం. మార్కాపురంలో వైసీపీకి కంచుకోటగా ఉన్న కొనకనమిట్ల మండలంలో తెలుగుదేశం గెలుపొందడం ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.


కాకినాడలో కూటమి పంజా

కాకినాడ జిల్లా పరిషత్‌లో 20కి 20 స్థానాల్లోనూ కూట మి అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ 11 స్థానాలు, జనసేన 7, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 20 జడ్పీటీసీలూ కూటమి ఖాతాలోనే పడ్డాయి. ఏలూరు జిల్లాలోని 27 జడ్పీటీసీలకు గాను కూటమి 24 స్థానాలు దక్కించుకుంది.

ఎన్టీఆర్‌, కృష్ణాలో ఎదురులేని టీడీపీ

ఎన్టీఆర్‌ జిల్లాలో టీడీపీ సత్తా చాటింది. మొత్తం 16 జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులు 13 చోట్ల పోటీ చేసి 100 శాతం స్టైక్‌ రేట్‌తో మొత్తం గెలుచుకున్నారు. ఒక చోట బీజేపీ, రెండు స్థానాల్లో వైసీపీ గెలిచాయి. జిల్లాలోని 276 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ 201, వైసీపీ 50, జనసేన 22 చోట్ల గెలిచాయి. కృష్ణా జిల్లాలోనూ కూటమి భారీ ఆధిక్యం ప్రదర్శించింది.

26 జడ్పీటీసీలకు గాను 24 స్థానాల్లో గెలుపొందింది. టీడీపీ అభ్యర్థులు 19 స్థానాల్లో, జనసేన 4 స్థానాల్లో, బీజేపీ ఒక స్థానంలో, వైసీపీ ఒకస్థానంలో, టీడీపీ రెబల్‌ ఒక స్థానంలో గెలుపొందారు. గన్నవరం జడ్పీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి 63 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మొవ్వ జడ్పీటీసీ స్థానంలో టీడీపీ రెబల్‌గా పోటీచేసిన వీరపనేని వీరేంద్ర 6,389 ఓట్లతో గెలుపొందారు.

ఈ వార్తలనూ చదవండి:

కూటమి.. సునామీ

ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..

Updated Date - Nov 08 , 2026 | 05:34 AM