Share News

రాళ్లు రువ్వారు... కారం చల్లారు

ABN , Publish Date - Nov 22 , 2026 | 01:02 AM

మార్కాపురం జిల్లాలో పక్కా ప్రణాళితో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. టీడీపీ వర్గీయులపై రాళ్లు రువ్వి, కారం చల్లి దాడి చేశారు.

రాళ్లు రువ్వారు... కారం చల్లారు

  • టీడీపీ వారిపై వైసీపీ శ్రేణుల దాడి

  • విశ్వనాథపురంలో ఆరుగురికి గాయాలు

  • ఎస్‌ఐ చేతికి గాయం... పికెట్‌ ఏర్పాటు

  • పిడుగురాళ్ల టీడీపీ ఎంపీపీ కారు ధ్వంసం

త్రిపురాంతకం(ఎర్రగొండపాలెం రూరల్‌), దొనకొండ, పిడుగురాళ్ల, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): మార్కాపురం జిల్లాలో పక్కా ప్రణాళితో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. టీడీపీ వర్గీయులపై రాళ్లు రువ్వి, కారం చల్లి దాడి చేశారు. త్రిపురాంతకం మండలం విశ్వనాథపురం గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇరుపక్షాలూ నామినేషన్లు వేసి గ్రామానికి చేరుకున్నాయి. వైసీపీ వర్గీయులు తాము ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌తో టీడీపీ నేతకు చెందిన కోడిని తొక్కించారు. అక్కడితో ఆగకుండా వీధిలో వారగా వేసి ఉన్న కుర్చీలనూ ఈడ్చుకుంటూ వెళ్లారు.

దీనిని టీడీపీ నేత ఏడుకొండలు ప్రశ్నించగా.. ‘అవసరమైతే నిన్ను కూడా తొక్కిస్తా’ అంటూ డ్రైవర్‌... ఆయనపైకి ట్రాక్టర్‌ను తోలాడు. అదే సమయంలో మిగిలిన వైసీపీ నేతలు అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న రాళ్లు రువ్వారు. కారం తీసి టీడీపీ నేతలపై జల్లారు. ఈ దాడిలో టీడీపీకి చెందిన బసిపాటి నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలు కాగా, ఐదుగురికి గాయాలయ్యాయి. సమీపంలోని ఇళ్లు ధ్వంసమయ్యాయి. గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఎస్సై బాబూరావు సిబ్బందితో వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈక్రమంలో ఎస్‌ఐ చేతికి గాయమైంది. సీఐ మాతంగి శ్రీనివాసరావు అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చి పికెట్‌ ఏర్పాటు చేశారు.


దొనకొండ మండలంలో మారణాయుధాలతో దాడి

దొనకొండ మండలంలోని పోలేపల్లి ఎస్సీ కాలనీలో టీడీపీ వర్గీయులపై వైసీపీ వారు మారణాయుధాలతో దాడిచేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలనీకి చెందిన యద్దనపూడి జక్కరబాబు టీడీపీ మద్దతుతో వార్డు సభ్యుడిగా నామినేషన్‌ వేశారు. దీంతో కక్షగట్టిన అదే కాలనీకి చెందిన వైసీపీ కార్యకర్తలు వై.బాలగురవయ్య, అచ్చయ్య, మరికొందరు జక్కరబాబు ఇంటిపై మారణాయుధాలతో దాడి చేశారు. ఆ సమయంలో జక్కరబాబు ఇంటి వద్ద లేకపోవటంతో అతని బంధువులైన యద్దనపూడి బాలగురవయ్య, సంపూర్ణ, ఆవులక్కలపై కత్తులతో దాడిచేశారు. తీవ్ర గాయాలపాలైన ముగ్గురినీ 108 సిబ్బంది దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దొనకొండ ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పల్నాడులో రెండుచోట్ల దాడులు

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం చెన్నాయపాలెంలో టీడీపీ వర్గీయులపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఎంపీపీ గండికోట శివకుమారి కారును ధ్వంసం చేశారు. మండల టీడీపీ అధ్యక్షుడు, బీసీ నాయకుడు, ఎంపీపీ గండికోట శివకుమారి భర్త వెంకటేశ్వర్లును లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడినట్లు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. నామినేషన్ల సరళిని పరిశీలించి తిరిగి వెళ్తున్న టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతలు రాళ్లు, కర్రలతో దాడి చేశారని వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరాలపాడు గ్రామంలోనూ నామినేషన్‌ కేంద్రం వద్ద వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదం, తోపులాటకు దిగారు. మహిళలను ముందు పెట్టి పోలీసులపై దాడికి యత్నించారు.

ఈ వార్తలనూ చదవండి:

బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

Updated Date - Nov 22 , 2026 | 01:18 AM