వైసీపీ విధ్వంసాలపై చర్యలు తీసుకోవాలి: టీడీపీ
ABN , Publish Date - Nov 19 , 2026 | 05:47 AM
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కడప, పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై తెలుగుదేశం పార్టీ నేతల బృందం...
అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కడప, పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై తెలుగుదేశం పార్టీ నేతల బృందం బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాను కలసి ఫిర్యాదు చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య నేతృత్వంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు, ఏపీఈడబ్ల్యూఐడీసీ చైౖర్మన్ ఎస్. రాజశేఖర్, ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్‌తో కూడిన బృందం ఎస్‌ఈసీని కలసి లిఖితపూర్వక ఫిర్యాదును అందజేసింది.
కడప, పల్నాడు జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీయేతర మద్దతుదారులు, పోలీసులపై జరిగిన దౌర్జన్యాలు, బెదిరింపులు, వాహనాల ధ్వంసానికి సంబంధించిన వీడియో ఆధారాలతో కూడిన పెన్ డ్రైవ్‌ను ఎస్‌ఈసీకి అందజేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా తక్షణమే జోక్యం చేసుకుని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్‌కు విన్నవించారు.
అనంతరం ఎమ్మెల్సీ వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మాజీ సీఎం వైఎస్ జగన్ అరాచక పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓవైపు అరాచకాలకు పాల్పడుతూనే, ఏమీ ఎరగనట్లు నంగనాచిలా పొద్దున్నే తమ బృందాన్ని ఎన్నికల కమిషన్ వద్దకు పంపి టీడీపీ వాళ్లు నామినేషన్ వేయనివ్వడం లేదంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? ‘మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్లు’ అనే సామెత సరిగ్గా జగన్‌కి సరిపోతుంది’’ అని వర్ల విమర్శించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్
పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్