44 ఏళ్ల సేవలకు గుర్తింపు
ABN , Publish Date - Nov 21 , 2026 | 02:48 AM
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కర్నూలు జడ్పీ పీఠంపై సామాన్య కార్యకర్త చూడి ఉలిగయ్యను కూర్చోబెట్టారు.
ఉలిగయ్యకు కర్నూలు జడ్పీ పీఠం
కర్నూలు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కర్నూలు జడ్పీ పీఠంపై సామాన్య కార్యకర్త చూడి ఉలిగయ్యను కూర్చోబెట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచి.. అంటే 1982లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన నాటి నుంచి ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమ పార్టీలో చేరాలని ఆయన్ను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. ఆయన ససేమిరా అనడంతో అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. ఆయన జైల్లో ఉండగానే ఆయన భార్య కౌతాళం ఎంపీపీ చాముండేశ్వరిపై అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుంచి దింపేశారు. అయినా ఉలిగయ్య పార్టీని వీడలేదు.
2004-06 మధ్య 32కి పైగా అక్రమ కేసులు పెట్టారని, పొలాలు బీళ్లు పెట్టించి ఆర్థికంగా నష్టపరిచారని.. అయినా తన తండ్రి పార్టీని వదల్లేదని ఆయన కుమారుడు, టీడీపీ మండల కన్వీనర్ సురేశ్‌నాయుడు తెలిపారు. ఉలిగయ్య 44 ఏళ్లుగా సామాన్య కార్యకర్తగా, మండల కన్వీనర్‌గా, జిల్లా ఉపాధ్యక్షుడిగా పార్టీకి సేవలు అందించినా.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ వాల్మీకి/బోయ ఫెడరేషన్ డైరెక్టర్ పదవి తప్ప ఇంకే పదవీ దక్కలేదు.
తాజా ఎన్నికల్లో కౌతాళం జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. కర్నూలు జడ్పీ పీఠాన్ని బీసీ జనరల్‌కు కేటాయించడంతో ఈ పదవిని ఉలిగయ్యకు చంద్రబాబు కట్టబెట్టారు. అదేవిధంగా వైస్ చైర్‌పర్సన్‌గా దేవనకొండ జడ్పీటీసీ షేక్ సాదికను ఎంపిక చేశారు. యువతను ప్రోత్సహించే క్రమంలో 22 ఏళ్ల సాదికకు అవకాశం కల్పించారు. ఈమె ప్రస్తుతం ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి
తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి