అదే జోరు!.. పుర పోరులోనూ ‘సార్వత్రిక’ ఫలితమే
ABN , Publish Date - Nov 05 , 2026 | 05:38 AM
జగన్ హయాంలో 2021లో జరిగిన స్థానిక ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బహిష్కరించింది. అరునా నాడు అధికార వైసీపీకి 80 శాతం విజయాలు మాత్రమే దక్కాయి.
కార్పొరేషన్లలో 95 శాతంపైనే
81 పురపాలికలు, 12 కార్పొరేషన్లు కైవసం
వైసీపీకి దక్కిన మున్సిపాలిటీలు మూడే
గెలుపు 3.5 శాతం మాత్రమే
స్వతంత్రుల ఖాతాలో రెండు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో 2021లో జరిగిన స్థానిక ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బహిష్కరించింది. అయినా నాడు అధికార వైసీపీకి 80 శాతం విజయాలు మాత్రమే దక్కాయి. నేడు అదే పార్టీ ప్రతిపక్షంగా స్థానిక ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీచేసినా.. గెలుపు శాతం కేవలం 3.5. పాలక తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ఏకంగా 94.2 శాతం స్ట్రయిక్ రేట్‌తో 81 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ కూటమి 175 స్థానాలకు గాను 94 శాతం స్ట్రయిక్ రేట్‌తో 164 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. స్థానిక ఎన్నికల్లోనూ అదే హవా కొనసాగించింది. అప్పుడు 11 అసెంబ్లీ సీట్లలో మాత్రమే గెలిచిన వైసీపీ.. ఇప్పుడు కేవలం 3 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌కు పరిమితమైంది. రెండు మున్సిపాలిటీలను దక్కించుకున్న స్వతంత్రులతో (2.3 శాతం) జగన్ పార్టీ పోటీ పడిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇంకా చీరాల పురపాలక సంఘం ఫలితం వెలువడాల్సి ఉంది. ఇక్కడ శుక్రవారం (6న) ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఇది కూడా తమ ఖాతాలోనే పడుతుందని టీడీపీ ధీమాగా ఉంది. అదే జరిగితే గెలుపు లెక్క మరింత పెరుగనుంది.
కూటమికి 81-12: 87 మున్సిపాలిటీలకు గాను ఫలితాలు ప్రకటించిన 86 పురపాలికల్లో కూటమిలోని మూడు పార్టీలు దక్కించుకున్నవి 81. ఇది 94.2శాతం మేర విజయబావుటాను సూచిస్తోంది. వైసీపీ గెలుచుకున్న మున్సిపాలిటీలు మూడే. దాని గెలుపు శాతం కేవలం 3.5. ఇండిపెండెంట్లు రెండు చోట్ల గెలిచి 2.3 శాతం ఫలితాలను చేజిక్కించుకున్నారు. ఇంకా విచిత్రంగా.. స్వతంత్ర అభ్యర్ధులే వైసీపీ విజయావకాశాలను దెబ్బతీశారు.
కార్పొరేషన్లలో 95 శాతంపైనే..
రాష్ట్రంలో 13 నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. అందులో కూటమి 12 కార్పొరేషన్లను దక్కించుకుంది. అంటే 95 శాతంపైనే గెలుపు నమోదైంది. వైసీపీ ఒక్క చోటే (అనంతపురం) విజయం సాధించింది. టీడీపీ 10 కార్పొరేషన్లలో (విజయనగరం, విశాఖ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, కడప, చిత్తూరు, తిరుపతి).. జనసేన రెండు కార్పొరేషన్ల(ఏలూరు, విజయవాడ)లో గెలుపొందాయి. బీజేపీ అనంతపురంలో ఓడిపోయింది. వైసీపీకి దక్కింది ఇదే.
82.32శాతం వార్డులు కూటమికే..
ఇటు కార్పొరేషన్లలోని డివిజన్లు, అటు మున్సిపాలిటీల్లోని వార్డుల్లో సైతం కూటమి ప్రభంజనం వీచింది. మొత్తంగా 82.32 శాతం వార్డులను దక్కించుకోగా.. వైసీపీ వాటా 14.11 శాతమే (550 వార్డులు). 3.18 శాతం వాటాతో స్వతంత్రులు 124 వార్డులు దక్కించుకున్నారు. సీపీఎంకు 5, సీపీఐకి 7 వార్డులు దక్కాయి. బీఎ్సపీ ఒక వార్డుతో సరిపెట్టుకుంది. ఇప్పుటి వరకు వచ్చిన ఫలితాలను విశ్లేషిస్తే.. కూటమికి 3,208 డివిజన్లు/వార్డులు దక్కాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్