ఓటమి భయంతో ఓటర్లపై దాడులు
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:14 AM
ఓటమి భయంతో పరిషత్ ఎన్నికల్లో వైసీపీ నేతలు దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడ్డారంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది.
పరిషత్ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు
అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ఓటమి భయంతో పరిషత్ ఎన్నికల్లో వైసీపీ నేతలు దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడ్డారంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. గురువారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నసీర్ అహ్మద్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాంప్రసాద్‌తో కూడిన బృందం ఎస్‌ఈసీని కలసి వైసీపీ అరాచకాలపై సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసింది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పరాభవానికి గురవడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసి ఓటింగ్ శాతం తగ్గించేందుకు వైసీపీ నేతలు కుట్రపన్నుతున్నారని అన్నారు.
చంద్రగిరి నియోజకవర్గంలో మంగళంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పులివెందులలోని పలు ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులపై వైసీపీ శ్రేణులు పెట్రోలు బాంబులు వేసి గూండాగిరి చేసి బెదిరింపులకు పాల్పడిన వీడియో ఆధారాలతో కూడిన పెన్‌డ్రైన్‌ను ఎస్‌ఈసీకి సమర్పించారు. అశాంతి సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ, ఐజీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎన్నికల సంఘం అధికారులు సానుకూలంగా స్పందించారు. అనంతరం నసీర్ అహ్మద్, గల్లా మాధవి విలేకరులతో మాట్లాడుతూ... ‘స్థానిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్న జగన్ ఆదేశాలతో వైసీపీ నాయకులు క్షేత్రస్థాయిలో దాడులకు తెగబడ్డారు. జగన్‌రెడ్డికి ప్రజాస్వామ్యన్నా, ప్రజలన్నా గౌరవం లేదు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం కూటమి పక్షానే నిలుస్తున్నారు’ అని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ