1, 1, 2, 2, 3, 3..! ఇవి.. పరిషత్ అభ్యర్థుల మెజారిటీ
ABN , Publish Date - Nov 08 , 2026 | 05:29 AM
1, 1, 2, 2, 3, 3.. ఇవేవో విద్యార్థులు పోటీ పరీక్షల్లో సాధించిన ర్యాంకులు కాదు. తాజా పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ ఓట్లు!. ఆశ్చర్యంగా అనిపించినా నిజం.
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): 1, 1, 2, 2, 3, 3.. ఇవేవో విద్యార్థులు పోటీ పరీక్షల్లో సాధించిన ర్యాంకులు కాదు. తాజా పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ ఓట్లు!. ఆశ్చర్యంగా అనిపించినా నిజం. ఒక్క ఓటు రెండు, మూడు ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థులపై గెలుపు గుర్రం ఎక్కిన అభ్యర్థుల ఆనందం అంతా ఇంతా కాదు.
ఒక్క ఓటే గెలిపించింది..
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కొల్లి అరుణకుమారి ఒక్క ఓటుతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి కొడమంచిలి సరోజినికి 879 ఓట్లురాగా అరుణ కుమారికి 880 ఓట్లు వచ్చాయి.
తాడేపల్లిగూడెం మండలం కడియం ఎంపీటీసీ స్థానాన్ని జనసేన సొంతం చేసుకుంది. మొదటి లెక్కింపులో వైసీపీ అభ్యర్థి కొండపల్లి నాగలక్ష్మి ఒక ఓటుతో గెలుపొందారు. అయితే, జనసేన అభ్యర్థిని దారపురెడ్డి పద్మ రీకౌంటింగ్ కోరగా.. పద్మ ఒక ఓటు మెజారిటీతో గెలుపొందింది.
రెండు ఓట్లతో..
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం సెగ్మెంట్‌లో టీడీపీ అభ్యర్థిని కొండూరు అరుణ 2 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వైసీపీ అభ్యర్థి సుజాతమ్మకు 851 ఓట్లు రాగా, అరుణకు 853 ఓట్లు వచ్చాయి.
చిత్తూరు జిల్లా వి.కోట మండలం ముదరందొడ్డి-2 ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి హబీబ్ రెండు ఓట్లతో గెలుపొందారు. తొలుత వైసీపీ అభ్యర్థి షబ్బీర్‌కు హబీబ్ కన్నా ఓ ఓటు ఎక్కువ వచ్చింది. దీంతో హబీబ్ రీకౌంటింగ్ కోరారు. రీకౌంటింగ్ అనంతరం వైసీపీ అభ్యర్థికి పడిన ఓట్లలో మూడు చెల్లనివిగా నిర్ధారించారు. దీంతో హబీబ్ 2 ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు అధికారి ప్రకటించారు.
మూడు ఓట్ల మెజారిటీ..
నెల్లూరు జిల్లా గూడూరు మండలం తిప్పవరప్పా డు సెగ్మెంట్‌లో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి రాధాకృష్ణారెడ్డి 3 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి సునీల్‌రెడ్డికి 1,319 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థికి 1,322 ఓట్లు వచ్చాయి.
తూర్పుగోదావరి జిల్లా రావిమెట్ల ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి వీరమల్ల సుబ్రహ్మణ్యం 3 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సుబ్రహ్మణ్యంకు 930 ఓట్లు, వైసీపీ అభ్యర్థి కాయల నాగమునికి 927 ఓట్లు వచ్చాయి.
తూర్పుగోదావ జిల్లా చంద్రవరం ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి కాట్రు శ్రీనివాసరావు 3 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థికి 768 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి టీడీపీకి 771 ఓట్లు వచ్చాయి.
నాలుగు ఓట్లతో
విశాఖ జిల్లా గంభీరం ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి ఇల్లిపిల్లి రమణ 4 ఓట్ల మెజారిటీతో విజయం సొంతం చేసుకున్నారు. రమణకు 1,665 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి లక్ష్మణకుమార్‌కు 1,661 ఓట్లు వచ్చాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..