Share News

ప్రకాశం జిల్లాలో టోల్‌గేట్ వద్ద ఘోర ప్రమాదం.. నలుగురి మృతి

ABN , Publish Date - Nov 29 , 2026 | 07:35 AM

ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌గేట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. టోల్ ఫీజు చెల్లించేందుకు ఆగి ఉన్న కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

ప్రకాశం జిల్లాలో టోల్‌గేట్ వద్ద ఘోర ప్రమాదం.. నలుగురి మృతి
Tanguturu Toll Gate,

ప్రకాశం, నవంబరు 29: ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా.. ప్రకాశంజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టంగుటూరు టోల్‌గేట్ వద్ద టోల్ ఫీజు చెల్లించేందుకు ఆగి ఉన్న కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో తీవ్ర విషాదం నెలకొంది. అతి వేగంగా దూసుకు వచ్చిన లారీ కారును ఢీ కొట్టడంతో ముందున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు, వెనుక నుంచి లారీకి మధ్య చిక్కుకుని నుజ్జు నుజ్జయింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసం కావడంతో అందులో ఉన్నవారు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించిన మరో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘోర ప్రమాదంతో టంగుటూరు టోల్‌గేట్ పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది.


మృతులంతా ప్రకాశం జిల్లా అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. కర్ణాటకలో నివాసం ఉంటున్న వీరు స్వగ్రామంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కారులో బయలుదేరినట్లు తెలిసింది. ప్రజాస్వామ్య పండుగలో పాల్గొని ఓటు వేసేందుకు స్వగ్రామానికి వస్తున్న క్రమంలో మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వారిని కబళించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడంతో బొమ్మనంపాడు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 07:48 AM