మైనింగ్ జీవోలో సవరణలు సబబే!
ABN , Publish Date - Nov 24 , 2026 | 01:17 AM
అక్రమ తవ్వకాలు, రవాణా, నిల్వలపై భారీగా జరిమానాలు, సీనరేజ్ ఫీజులు విధించే అధికారాన్ని మైనింగ్ శాఖకు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవో నంబరు 35లో సవరణలు పూర్తిగా సమర్థనీయమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీం కోర్టు
అంజనీ క్రషర్ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): అక్రమ తవ్వకాలు, రవాణా, నిల్వలపై భారీగా జరిమానాలు, సీనరేజ్ ఫీజులు విధించే అధికారాన్ని మైనింగ్ శాఖకు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవో నంబరు 35లో సవరణలు పూర్తిగా సమర్థనీయమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అంజనీ స్టోన్ క్రషర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
ఏపీ ప్రభుత్వం 2020 జూలై 1న జీవో 35లో రూల్ 26, 34లకు సవరణలు చేసింది. ఈ నేపథ్యంలో క్రషర్లు, క్వారీలలో విజిలెన్స్ తనిఖీలను ముమ్మరం చేసిన గనులశాఖ అధికారులు.. నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. అయితే.. కేంద్ర చట్టమైన ఎంఎండీఆర్ యాక్ట్-1957 ప్రకారం జరిమానాలు విధించే అధికారం క్రిమినల్ కోర్టులకు మాత్రమే ఉంటుందని, గనులశాఖకు లేదని పేర్కొంటూ ‘అంజనీ స్టోన్ క్రషర్’ తోపాటు మరికొన్ని క్వారీ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. క్వారీ యజమానులకు అనుకూలంగా తీర్పునిస్తూ డిమాండ్ నోటీసులను రద్దు చేసింది. ఈ తీర్పులను ఏపీ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట సవాల్ చేసింది.
అక్రమ మైనింగ్‌ను అరికట్టడానికి నిబంధనలు రూపొందించే, జరిమానాలు విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి, గనుల శాఖకు ఉందని డివిజన్ బెంచ్ తేల్చిచెప్పింది. జీవో 35లో సవరణలను సమర్థిస్తూ క్వారీ యజమానుల పిటిషన్లను కొట్టివేసి, సింగిల్ జడ్జి తీర్పులను రద్దు చేసింది. ఈ తీర్పును అంజనీ స్టోన్ క్రషర్ గత నెల 27న సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్ సోమవారం సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు.
ఈ వార్తలనూ చదవండి: