కల్తీ నెయ్యి కేసు బదిలీ కుదరదు
ABN , Publish Date - Nov 06 , 2026 | 05:16 AM
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణను బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
విచారణను పొరుగు రాష్ట్రానికి మార్చేందుకు తగిన కారణాలు లేవు
సాక్ష్యాలు, సాక్షులు ఎక్కువ ఏపీలోనే
సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడి
‘మాల్‌గంగా’ ఎండీ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణను బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ వెలుపలకు మార్చాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితుడిగా ఉన్న మహారాష్ట్రకు చెందిన డెయిరీ పరిశ్రమ వ్యాపారి, ‘మాల్‌గంగా మిల్క్ అండ్ అగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ మేనేజింగ్ డైరెక్టర్ మచీంద్ర శాంతారామ్ లంకే దాఖలు చేసిన పిటిషన్ గురువారం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్థార్థ్ దవే వాదనలు వినిపించారు. ‘‘కల్తీ నెయ్యి కేసుపై రాజకీయ నాయకులు నిత్యం ప్రకటనలు చేస్తుండటం వల్ల నిష్పక్షపాతంగా విచారణ జరిగేందుకు అనుకూలమైన వాతావరణం లేదు. ఇది పూర్తిగా రాజకీయ సమస్యగా మారింది. రాష్ట్రంలో ప్రతికూల వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్వయంగా ఈ అంశంపై ప్రకటనలు చేశారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత కూడా రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోలేదు.’’ అని తెలిపారు.
దీనిపై సీజేఐ స్పందిస్తూ.. తమ ఆదేశంతో వారందరూ నిశ్శబ్దంగా ఉన్నారని, ఏమైనా జరిగితే తమ వద్దకు రావచ్చునన్నారు. విచారణాధికారి ఎలాంటి ప్రభావానికి లోను కాకపోవచ్చునని, అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో సరైన రీతిలో న్యాయ విచారణ జరగడం కష్టమని, అందువల్ల ఈ కేసు విచారణను పొరుగు రాష్ర్టానికి మార్చాలని దవే కోరారు. ‘విచారణను పిటిషనర్ రాష్ర్టానికి మార్చమని కూడా కోరడం లేదు. ఏదో ఒక పొరుగు రాష్ర్టానికి మార్చమని మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నాం అని దవే ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఈ వాదనలతో ఏకీభవించని ధర్మాసనం మచీంద్ర శాంతారామ్ లంకే పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ