Share News

సాయికృష్ణ తల్లికి లేని ఆసక్తి మీకెందుకు

ABN , Publish Date - Sep 25 , 2026 | 06:01 AM

విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ కస్టడీ మృతి వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాయికృష్ణ తల్లికి లేని ఆసక్తి మీకెందుకు? అని అత్యున్నత న్యాయస్థానం ఆయన్ను నిలదీసింది.

సాయికృష్ణ తల్లికి లేని ఆసక్తి  మీకెందుకు

  • హైకోర్టులో విచారణ జరుగుతుండగా సుప్రీంకు రావడమేంటి?

  • తీర్పు రిజర్వ్‌ చేశాక దర్యాప్తు బదిలీ కోరడం సమంజసమేనా?

  • హైకోర్టులో ఏ తీర్పు వస్తుందో ముందే చెప్పలేం కదా?

  • మీకున్న పరిమితులకు లోబడే ఉండండి

  • వైసీపీ ఎంపీ గురుమూర్తిపై సుప్రీంకోర్టు అసహనం

  • తదుపరి విచారణ వచ్చే నెల 26కు వాయిదా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ కస్టడీ మృతి వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాయికృష్ణ తల్లికి లేని ఆసక్తి మీకెందుకు? అని అత్యున్నత న్యాయస్థానం ఆయన్ను నిలదీసింది. హైకోర్టులో విచారణ జరుగుతుండగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడమేంటని ప్రశ్నించింది. హైకోర్టులో తీర్పు రిజర్వ్‌ చేశాక దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టును కోరటం ఏ రకంగా సమంజసమో చెప్పాలంది. హైకోర్టులో ఏ తీర్పు వస్తుందో ముందే చెప్పలేం కదా? అని వ్యాఖ్యానించింది. మీకు కొన్ని పరిమితులు ఉన్నాయని, వాటికి లోబడే ఉండాలంటూ పరోక్షంగా చురకలంటించింది. సాయికృష్ణ నిర్బంధం, లాకప్‌ డెత్‌, సాక్ష్యాధారాల ధ్వంసం వ్యవహారంలో ఏపీ డీజీపీ, విజయవాడ సీపీ, ఏసీపీల పాత్రపై విచారణ జరగాలని, ఈ దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎంపీ గురుమూర్తి ఈనెల 17న దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మాసిహ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌ గురుమూర్తి తరఫున సీనియర్‌ న్యాయవాది నిఖిల్‌ గోయల్‌ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసిన విషయాన్ని బుధవారం సీనియర్‌ న్యాయవాది లూథ్రా తెలియజేశారని, అయితే ఇందులోనే మరో రెండు పిటిషన్లు పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తుచేశారు.


‘‘సాయికృష్ణ కేసుకు సంబంధించి ఒక పిటిషన్‌పై తీర్పును మాత్రమే హైకోర్టు రిజర్వ్‌ చేసింది. ప్రధాన పిటిషన్‌తో పాటు మరో పిటిషన్‌ పెండింగ్‌లోనే ఉంది. మొదటిది సీబీఐ విచారణ కోరుతూ సాయికృష్ణ తల్లి పిటిషన్‌. అది అక్టోబరు 7న విచారణకు రానుంది. రెండోది.. సాయికృష్ణ తల్లే హెబియస్‌ కార్పస్‌ దాఖలు చేశారు. ఈ అంశంపైనే హైకోర్టు ఇదే నెల 22న తీర్పును రిజర్వ్‌ చేసింది. మరోవైపు, ఓ ఎన్‌జీవో దాఖలు చేసిన పిటిషన్‌ హైకోర్టు సీజే ధర్మాసనం ఎదుట విచారణకు ఉంది. సాయికృష్ణ కేసు అత్యంత తీవ్రమైన నేరం. ప్రధాన పిటిషన్‌ విచారణ హైకోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉంది. కేసును సీబీఐకి అప్పగిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయి’’ అని గోయల్‌ పేర్కొన్నారు.

మీకొచ్చిన ఇబ్బంది ఏంటి?: ధర్మాసనం

సాయికృష్ణ తల్లి ఆ కేసును కొనసాగించకపోతే మీకేంటి ఇబ్బంది అని పిటిషనర్‌ గురుమూర్తిని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘సాయికృష్ణ తల్లి రెండు పిటిషన్లు దాఖలు చేశారు. హెబియస్‌ కార్ప్‌సపై హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. అయితే, సీబీఐ దర్యాప్తు కోరుతూ ఆమె మొదట పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ తర్వాత ఉపసంహరించుకుంటున్నట్లు ఐఏ వేశారు. కానీ, ఐఏ ఉపసంహరణకు కోర్టు అనుమతించలేదు. ఎన్‌జీవో పిటిషన్‌కు సంబంధించి చార్జిషీట్‌ దాఖలు చేసేశామని రాష్ట్రం చెబుతోంది. అసలు.. తల్లి పిటిషన్‌ను కొనసాగించకపోతే మీకేంటి? తల్లికే లేని ఆసక్తి మీకెందుకు? ఒకవైపు ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతోంది కదా? అలాంటప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం దేనికి? హైకోర్టు ఇప్పటికే తీర్పును రిజర్వ్‌ చేసిన కేసును బదిలీ చేయాలని అడగటం ఎంతవరకు సమంజసం?’’ అంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.


ఒకవేళ ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయని పక్షంలో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తుందని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను అక్టోబరు 26వ తేదీకి వాయిదా వేసింది. కాగా, సాయికృష్ణ అక్రమ నిర్బంధం, లాకప్‌ డెత్‌, సాక్ష్యాధారాల ధ్వంసం వ్యవహారంలో ఏపీ డీజీపీ, విజయవాడ సీపీ, ఏసీపీల పాత్రపై విచారణ జరగాలని, ఈ దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎంపీ గురుమూర్తి విజయవాడ 2వ అదనపు జ్యుడీషియల్‌ మొదటి మెజిస్ట్రేట్‌ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సాక్షుల వాంగ్మూలాలను సేకరించాలని కోర్టు ఆదేశించింది. అయితే, దీనిపై విజయవాడ సౌత్‌ ఏసీపీ మానస ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. దిగువ కోర్టు ఆదేశాలను నిలిపివేస్తూ ఆగస్టు 13న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఎంపీ గురుమూర్తి సెప్టెంబరు 17న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను గురువారం సుప్రీం ధర్మాసనం విచారించింది.

ఈ వార్తలనూ చదవండి...

మహిళల భద్రతకు ప్రాధాన్యం

బజార్‌లో పోస్టుల అమ్మకం

Updated Date - Sep 25 , 2026 | 06:16 AM