Share News

‘పట్టణ’ ఎన్నికలపై నేడు విచారణ

ABN , Publish Date - Oct 27 , 2026 | 04:01 AM

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు సందర్భంగా తమ పార్టీ అభ్యర్థులను అడ్డుకున్నారంటూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి విచారణ జరపనుంది.

‘పట్టణ’ ఎన్నికలపై నేడు విచారణ

ఎస్‌ఈసీ నివేదికల పరిశీలన

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ

అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు సందర్భంగా తమ పార్టీ అభ్యర్థులను అడ్డుకున్నారంటూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి విచారణ జరపనుంది. గత విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల అమలుపై రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే నివేదికలు ఈ విచారణలో కీలకం కానున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌పై ఇప్పటికే సుప్రీం ఆదేశాలతో ఈ నెల 28న జరగాల్సిన ఎన్నికల్ని నవంబరు 1కు మార్చారు. కోర్టు ఆదేశాల అమలుపై మంగళవారం నివేదిక దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. దీంతో సుప్రీంకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దాఖలు చేసే నివేదికపై ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందోనన్న ఉత్కంఠ అభ్యర్థుల్లో ఏర్పడింది. రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు ఈ నెల 14న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. నామినేషన్ల ప్రక్రియ 16 నుంచి 18 వరకు కొనసాగింది. అయితే తమ పార్టీ అభ్యర్థులను పలుచోట్ల నామినేషన్లు వేయనీకుండా అడ్డుకున్నారని వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


ఎన్నికల సంఘానికి సుప్రీం ఆదేశాలు

21న విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అభ్యర్థుల ఫిర్యాదులు, వాటికి సంబంధించిన పత్రాలు, వీడియో ఆధారాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. నామినేషన్లు వేయకుండా అడ్డంకులు ఎదురైనట్లు నిర్ధారణకు వచ్చిన చోట్ల గడువు పొడిగించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. గడువు పొడిగిస్తే నిర్ణయం ప్రకటించిన సమయం నుంచి కనీసం 48గంటల వ్యవధి ఇవ్వాలంది. నామినేషన్‌ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల నిఘా ఉండేలా చూడాలని డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

నేడు విచారణలో ఏం తేలనుందో?

ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం తమ చర్యలపై సమర్పించే నివేదికలను సుప్రీంకోర్టు పరిశీలించనుంది. నామినేషన్ల విషయంలో వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు, అవసరమైన చోట్ల గడువు పొడిగింపు వంటి అంశాలు విచారణలో కీలకం కానున్నాయి. అయితే ఎన్నికల షెడ్యూల్‌పై తుది నిర్ణయం ఎలా ఉంటాయన్నది విచారణ అనంతరం స్పష్టమవుతంది. రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ విచారణపై ఆసక్తి నెలకొంది.

ఈ వార్తలనూ చదవండి:

బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’

అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Updated Date - Oct 27 , 2026 | 04:01 AM