దొంగ బంగారం తాకట్టు కేసులో మణప్పురం సంస్థకు స్టే పొడిగింపు
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:29 AM
దొంగిలించిన బంగారు ఆభరణాల తాకట్టు వ్యవహారంలో మణప్పురం అసెట్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు గతంలో మంజూరు చేసిన మధ్యంతర స్టే ఉత్తర్వులను సుప్రీం కోర్టు పొడిగించింది.
విచారణను 4కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): దొంగిలించిన బంగారు ఆభరణాల తాకట్టు వ్యవహారంలో మణప్పురం అసెట్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు గతంలో మంజూరు చేసిన మధ్యంతర స్టే ఉత్తర్వులను సుప్రీం కోర్టు పొడిగించింది. ఏపీలోని భీమునిపట్నం, బొబ్బిలి తదితర ప్రాంతాల్లో దొంగతనానికి గురైన బంగారు ఆభరణాలను మణప్పురం శాఖల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందారు. ఆయా కేసుల దర్యాప్తులో భాగంగా తాకట్టు బంగారాన్ని అప్పగించాలంటూ పోలీసులు మణప్పురం బ్రాంచ్‌లకు నోటీసులు జారీ చేశారు. దీనిపై మణప్పురం సంస్థ 20కి పైగా రిట్ పిటిషన్లు వేయగా, వాటిని ఏపీ హైకోర్టు కొట్టేసింది.
దర్యాప్తు అవసరాల కోసం బంగారాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుందని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మణప్పురం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో గతేడాది సెప్టెంబరు 26న హైకోర్టు తీర్పుపై సుప్రీం మధ్యంతర స్టే ఇచ్చింది. ఆ పిటిషన్ గురువారం జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. కోర్టు స్టేతో కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతోందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
కాగా, ఎవరైనా వ్యక్తి... బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థ వద్ద బంగారం తాకట్టు పెట్టినప్పుడు, అది దొంగిలించినదా? కాదా? అన్నది ఆ సంస్థలు ఎలా నిర్థారించుకోగలవని కోర్టు ప్రశ్నించింది. మణప్పురం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... పోలీసులు నేరుగా సీఆర్‌పీసీ సెక్షన్ 91 కింద నోటీసులు ఇచ్చి తమకే బంగారం అప్పగించాలని కోరుతున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ేస్ట మంజూరు చేసిందని, దానిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అంగీకరించిన ధర్మాసనం స్టే ఉత్తర్వులను పొడిగించింది. విచారణను డిసెంబరు 4కు వాయిదా వేసింది.
ఈ వార్తలనూ చదవండి:
2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు
బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా