హథీరాంజీ మఠం లీజుదారుల పిటిషన్లు కొట్టివేత
ABN , Publish Date - Sep 26 , 2026 | 05:09 AM
తిరుపతిలోని హథీరాంజీ మఠం భూముల లీజుదారులకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. లీజులు రద్దు చేస్తూ ఇచ్చిన నోటీసులు, తదుపరి చర్యలను సవాల్ చేస్తూ ధనుంజయ్‌రెడ్డి సహా మొత్తం 13 మంది దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ధనుంజయ్‌రెడ్డి, ఇతర పిటిషనర్లకు సుప్రీంలో నిరాశ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని హథీరాంజీ మఠం భూముల లీజుదారులకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. లీజులు రద్దు చేస్తూ ఇచ్చిన నోటీసులు, తదుపరి చర్యలను సవాల్ చేస్తూ ధనుంజయ్‌రెడ్డి సహా మొత్తం 13 మంది దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేతో కూడి న ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. సెక్షన్-82 కింద నోటీసులు జారీ చేశారని, అయితే భూములను స్వాధీనం చేసుకునే క్రమంలో అనుసరించాల్సిన నిబంధనలు పాటించలేదని తెలిపారు. ఖాళీ చేయించే క్రమంలో జ్యూరిస్‌డిక్షనల్ డిప్యూటీ కమిషనర్ నుంచి ఎలాంటి ఉత్తర్వులు తీసుకోలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కనీస నిబంధనలు పాటించకుండా, చట్ట విరుద్ధంగా భూముల స్వాధీన ప్రక్రియ జరిగిందని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భూముల స్వాధీన క్రమంలో నోటీసులు జారీ చేసింది మఠమేనని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం లాజిస్టికల్ మద్దతే అందించిందని వివరించారు. మఠానికి సంబంధించిన వేలాది ఎకరాల భూములకు రికార్డులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు గతేడాది మే నెలలో సుప్రీంకోర్టే విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ పర్యవేక్షణ కొనసాగుతోందని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం స్పంది స్తూ.. సెక్షన్-82 కింద తీసుకున్న చర్యలను హైకోర్టు సమర్థించిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు తగిన కారణాలేమీ కనిపించడం లేదని స్పష్టం చేసింది. పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ