తొలిపోరుకు సున్నిపెంట సిద్ధం!
ABN , Publish Date - Nov 24 , 2026 | 06:33 AM
ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలానికి అతిచేరువలో ఉన్న సున్నిపెంట గ్రామం దశాబ్దాల తర్వాత తొలిసారిగా పల్లెపోరుకు సిద్ధమైంది. ఈ గ్రామానికి 2019లో గ్రామ పంచాయతీ హోదా దక్కడంతో...
దశాబ్దాలుగా దక్కని పంచాయతీ హోదా
2019లో హోదా.. పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్
ఆత్మకూరు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలానికి అతిచేరువలో ఉన్న సున్నిపెంట గ్రామం దశాబ్దాల తర్వాత తొలిసారిగా పల్లెపోరుకు సిద్ధమైంది. ఈ గ్రామానికి 2019లో గ్రామ పంచాయతీ హోదా దక్కడంతో ఇక్కడ సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. గతంలో ఇక్కడి ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో మాత్రమే ఓటు వేసేవారు. వాస్తవానికి 1960-1981 ప్రాంతంలో శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులతో పాటు కార్మికులు నివాసం ఉండేందుకు వీలుగా సున్నిపెంట ప్రాంతాన్ని ఎంపిక చేశారు. తొలుత అక్కడ తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ.. శ్రీశైల జలాశయంతో పాటు పక్కనే ఉన్న శ్రీశైల మల్లన్న క్షేత్రం ఖ్యాతితో వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా సున్నిపెంటలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
నిజానికి ఇక్కడ ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసేంత వీలుగా ప్రైవేటు భూమి లేదు. రెవెన్యూ, వ్యవసాయ శాఖకు చెందిన భూములు కూడా తక్కువే. దీంతో సున్నిపెంటను అధికారికంగా గ్రామ పంచాయతీగా ప్రకటించలేని పరిస్థితి. స్థానిక పాలకులు సున్నిపెంటను గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఎట్టకేలకు 2019 అక్టోబరు 1న సున్నిపెంటకు గ్రామ పంచాయతీ హోదా కల్పించారు. తాజా ఎన్నికల్లో సున్నిపెంట సర్పంచ్ స్థానాన్ని అన్ రిజర్వ్డ్ అభ్యర్థికి కేటాయించారు. దీంతో ఆశావాహుల సంఖ్య పెరిగింది. అయితే తొలిసారి జరుగుతున్న ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని పార్టీల నాయకులు భావిస్తున్నారు.
14,668 మంది ఓటర్లు
సున్నిపెంటలో ప్రస్తుతం 21,452 మంది జనాభా, 14,668 మంది ఓటర్లు ఉన్నారు. సర్పంచ్‌తో పాటు 14 వార్డులకు జరిగే పంచాయతీ ఎన్నికలకు 28 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాి సద్ధమైందని ఆత్మకూరు ఎంపీడీవో అరిగెల రమణ తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి: