శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనంలో కీలక మార్పులు.. భక్తులకు దేవస్థానం కీలక సూచనలు
ABN , Publish Date - Jul 18 , 2026 | 09:40 PM
శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో స్పర్శ దర్శన విధానంలో దేవస్థానం కీలక మార్పులు చేసింది. భక్తుల సౌకర్యం, రద్దీ నియంత్రణ దృష్ట్యా కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది.
శ్రీశైలం, జులై18: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో స్పర్శ దర్శన విధానంలో కీలక మార్పులు చేపట్టినట్లు దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు. శని, ఆది, సోమవారాల్లో ఉదయం వేళల్లో మనమిత్ర వాట్సాప్, ఆన్‌లైన్ ద్వారా ముందుగానే స్పర్శ దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ప్రముఖులు స్వయంగా ఆలయానికి విచ్చేసిన సందర్భంలో మాత్రమే ప్రాధాన్యతను బట్టి ఉదయం స్పర్శ దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు.
ఇక సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు ఉదయం వేళల్లో స్పర్శ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. వారికి అవకాశం ఉన్న మేరకు రాత్రి 9 గంటల సమయంలో స్పర్శ దర్శనానికి అనుమతి కల్పిస్తామని తెలిపారు. మరోవైపు సర్వదర్శనం, ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం ద్వారా వచ్చే భక్తులకు ఎక్కువ సమయం కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యం, రద్దీ నియంత్రణను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేపట్టినట్లు వెల్లడించిన చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు.. భక్తులంతా కొత్త నిబంధనలను గమనించి దేవస్థానానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి
దేశ అంతరిక్ష కలలకు చిరునామాగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
గంజాయి పండిస్తున్న సాధువు.. అరెస్ట్ చేసిన పోలీసులు