నీరు కోరుతున్న సీమ నేల!
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:39 AM
రాష్ట్రంలోని కోస్తా ప్రాంతంలో వరుస తుఫాన్లు పంటలను నాశనం చేస్తుంటే.. రాయలసీమలో తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి.
డెడ్ స్టోరేజీకి చేరువలో శ్రీశైలం
కృష్ణా డెల్టాకూ తీరని నీటి అవసరాలు
సాగర్ నుంచి పులిచింతలకు నీరు వదలండి
11 టీఎంసీలకు ఇండెంట్ పెట్టిన ఏపీ
ఎల్లుండి కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ
అమరావతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కోస్తా ప్రాంతంలో వరుస తుఫాన్లు పంటలను నాశనం చేస్తుంటే.. రాయలసీమలో తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఎగువన కృష్ణా పరీవాహక ప్రాంతం నుంచి ఈ ఏడాది వరద అంతంతమాత్రంగానే రావడంతో శ్రీశైలం జలాశయానికి వచ్చిన నీటిని తాగు అవసరాలకు మాత్రమే వినియోగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జలవిద్యుదుత్పత్తికి తెలంగాణ నీరు వాడేయడంతో ప్రస్తుతం శ్రీశైలం డ్యాం అడుగంటింది.
జలాశయంలో 215.80 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 46.823 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. మరో 8 టీఎంసీలు వాడేస్తే 38 టీఎంసీల డెడ్ స్టోరేజీ (కనిష్ఠ నీటి వినియోగ స్థాయి)కి చేరుకుంటుంది. ఈ నీటిని డిసెంబరులోనే వాడేస్తే.. వేసవిలో తాగునీటి అవసరాలు తీర్చడమెలాగని రాష్ట్ర జల వనరుల శాఖ ఆందోళన చెందుతోంది. సీమలో మొక్కజొన్నలాంటి పంటలకు హంద్రీ-నీవా సుజల స్రవంతి ద్వారా ఒక్క తడికైనా నీరివ్వాలని రైతులు అభ్యర్థిస్తున్నారు. ఇంకోవైపు.. నాగార్జునసాగర్‌లో 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికిగాను 177 టీఎంసీలు ఉన్నాయి. కృష్ణా డెల్టాలోనూ నీటి అవసరాలు తీరలేదు.
ఈ నేపథ్యంలో సాగర్ నుంచి పులిచింతలకు 11 టీఎంసీలు విడుదల చేయాలని జలవనరుల శాఖ ఇండెంట్ పెట్టింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు లేఖ రాసింది. సోమవారం (23న) జరిగే త్రిసభ్య కమిటీ సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చించాలని డిమాండ్ చేసింది. పులిచింతలకు నీటి విడుదలే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరపాలని కోరింది.
రాష్ట్రంలో 27.82 శాతం లోటు వర్షపాతం..
వరుస తుఫాన్లు ఉత్తరాంధ్ర, కోస్తాలను అతలాకుతలం చేసినా.. సాధారణ వర్షపాతం కంటే 27.82 శాతం లోటు ఉందని జల వనరుల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణ వర్షపాతం 834.6 మిల్లీమీటర్లకు గాను 602.44 మిల్లీమీటర్లే నమోదైంది. కోస్తాలోనూ కరువు ఛాయలున్నాయని.. రాయలసీమలో పరిస్థితి దారుణంగా ఉందని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో 58 శాతం, ప్రకాశం-56, కడప-53, కర్నూలు-52, మార్కాపురం-52, నంద్యాల-51, అన్నమయ్య-50, నెల్లూరు-48.91, అనంతపురం-44, చిత్తూరు-40, తిరుపతి జిల్లాలో 34 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైంది.
ఈ వార్తలనూ చదవండి:
పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి
తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి