Share News

శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 100 టీఎంసీలకు చేరువలో..

ABN , Publish Date - Aug 04 , 2026 | 09:25 AM

శ్రీశైలం జలాశయంలో నీటినిల్వలు వేగంగా పెరుగుతున్నాయి. ఐదు రోజుల కిందట ప్రవాహం మొదలై 820 అడుగుల నుంచి పెరుగుతూ వస్తున్న కృష్ణమ్మ.. సోమవారం సాయంత్రానికి 855.10 అడుగులకు చేరింది.

శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 100 టీఎంసీలకు చేరువలో..
Srisailam Dam

  • డ్యాంలో 92 టీఎంసీల వరద చేరిక

  • నేడు వంద దాటుతుందన్న అంచనా

  • రాత్రికి 1.55 లక్షల క్యూసెక్కుల రాక

  • జూరాల నుంచి 2.21 లక్షల క్యూసెక్కులు

  • ఆలమట్టి నుంచి కొనసాగుతున్న వరద

శ్రీశైలం/అమరావతి/అచ్చంపేట/విజయపురి సౌత్‌ (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలో నీటినిల్వలు వేగంగా పెరుగుతున్నాయి. ఐదు రోజుల కిందట ప్రవాహం మొదలై 820 అడుగుల నుంచి పెరుగుతూ వస్తున్న కృష్ణమ్మ.. సోమవారం సాయంత్రానికి 855.10 అడుగులకు చేరింది. ప్రస్తుతం 92.048 టీఎంసీల నీరుంది. మంగళవారం సాయంత్రానికి వంద టీఎంసీలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం జూరాల ప్రాజెక్టు నుంచి 2.21 లక్షల క్యూసెక్కులు శ్రీశైలానికి విడుదల చేశారు. రాత్రి సమయానికి శ్రీశైలానికి 1.55 లక్షల క్యూసెక్కులు వచ్చి చేరింది.


రోజూ లక్ష క్యూసెక్కులకు పైగా ప్రవాహ ఉధృతి మరో నాలుగైదు రోజులు కొనసాగవచ్చని శ్రీశైలం డ్యాం సీఈ కబీర్‌ బాషా తెలిపారు. ఎగువన కర్ణాటకలో ఆలమట్టికి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యాంలోకి 1,25,855 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 1.50 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. నారాయణపూర్‌కు 1,28,954 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 1,40,880 క్యూసెక్కులు వదిలారు. వీటికి భీమా నది వరద జలాలు కలుస్తున్నాయి. దీంతో జూరాలకు మొత్తం 1.92 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.


ఎగువ నుంచి వచ్చే వరదను దృష్టిలో ఉంచుకొని 2,21,765 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యాంలోకి సోమవారం 57,785 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. తాగునీటి అవసరాల కోసం వివిధ కాలువలకు 1390 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 136 టీఎంసీల నిల్వలున్నాయి. ఎగువ నుంచి 900 క్యూసెక్కులు వస్తున్నాయి. పులిచింతలలో సోమవారం 28.91 టీఎంసీల నిల్వ ఉంది. ప్రకాశం బ్యారేజీలోకి 6958 క్యూసెక్కులు వస్తుంటే.. 6499 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

‘సిట్‌’ అదుపులో ఈశ్వర్‌ కిరణ్‌

గుంతలకు ‘రోడ్‌ డాక్టర్‌’ చికిత్స..!

Updated Date - Aug 04 , 2026 | 09:43 AM