Share News

గుంతలకు ‘రోడ్‌ డాక్టర్‌’ చికిత్స..!

ABN , Publish Date - Aug 04 , 2026 | 09:11 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు నరకయాతన అనుభవించారు. ఈ పరిస్థితిని గుర్తించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్ల అభివృద్ధిపై దృష్టిపెట్టింది.

గుంతలకు ‘రోడ్‌ డాక్టర్‌’ చికిత్స..!
Kakinada Road Doctor

  • రోడ్‌ డాక్టర్‌ వాహనంతో వేగంగా మరమ్మతులు

  • నిమిషాల్లోనే పని పూర్తి.. ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌

  • పనితనాన్ని మెచ్చుకుంటున్న కాకినాడ ప్రజలు

కాకినాడ కార్పొరేషన్‌-ఆంధ్రజ్యోతి: విశాలమైన రోడ్లు, ట్రాఫిక్‌ సమస్యలు లేని వ్యవస్థ, సురక్షిత ప్రయాణం.. ఇవే ఆధునిక పట్టణ ప్రగతికి సూచికలు. అయితే దేశంలోని అనేక నగరాల్లో రోడ్లపై గుంతలు నిత్య సమస్యగా మారుతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇవి ప్రమాదకరంగా మారి వాహనదారులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు నరకయాతన అనుభవించారు. ఈ పరిస్థితిని గుర్తించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్ల అభివృద్ధిపై దృష్టిపెట్టింది. రోడ్ల మరమ్మతుల కోసం హెటెక్‌ విధానాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రవేశపెట్టిన ‘రోడ్‌ డాక్టర్‌ సేవ’ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. రోడ్లపై ఎక్కడైనా గుంతలు కనిపిస్తే అక్కడికక్కడే నిమిషాల్లోనే పూడ్చే ఈ హైటెక్‌ సంచార వాహనం పట్టణ రహదారుల నిర్వహణలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది.


ఏమిటీ రోడ్‌ డాక్టర్‌ ప్రత్యేకతలు..!

రోడ్లపై గుంతలను వేగంగా పూడ్చివేయడానికి ఉపయోగించే అత్యాధునిక ప్రత్యేక మొబైల్‌ వాహనమిది. జెట్‌ ప్యాచర్‌ టెక్నాలజీతో పనిచేసే ఈ వాహనం.. రోడ్లపై గుంతలను గుర్తించి నిమిషాల్లోనే పూడ్చివేస్తుంది. గుంత ఉన్న ప్రాంతంలో ముందుగా దుమ్ము, చెత్తను శుభ్రం చేస్తుంది. అనంతరం తారు, కంకర మిశ్రమాన్ని వాహనంలోనే సిద్ధం చేస్తుంది. తర్వాత ఆ మిశ్రమాన్ని గుంతలో నింపి అధిక ఒత్తిడితో చదునుచేస్తుంది. చిన్న గుంతలైతే 10-15 నిమిషాల్లో.. కొంచె పెద్దవైతే గంటలోపే పని పూర్తిచేస్తుంది. దీనివల్ల ట్రాఫిక్‌కు అంత రాయం కలగకుండా పనులు వేగంగా పూర్తవుతాయి. ఈ యంత్రం ద్వారా పాత బిటుమెన్‌ను మళ్లీ వినియోగించుకోవచ్చు. దీనివల్ల మెటీరియల్‌ వృథాతోపాటు కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయి. శబ్ధం, వ్యర్థాలు లేకుండా పని పూర్తవడం మరో ప్రత్యేకత. రూ.1,48,73,900 విలువ చేసే ఈ యంత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. వాటి నిర్వహణను మున్సిపాలిటీలు చేపట్టాలి.


ఇప్పటివరకు 1,800 చ.మీ పనులు

కాకినాడలో ఈ యంత్రం 2025 నవంబరు నుంచి అందుబాటులోకి వచ్చింది. దీని సాయంతో ఇప్పటివరకు సుమారు 1,800 చదరపు మీటర్ల మేర మరమ్మతులు చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రూ.27.97 లక్షల విలువైన పనులు పూర్తయ్యాయి.

ప్రజల నుంచి విశేష స్పందన...

గతంలో గుంతల గురించి ఫిర్యాదు చేస్తే నెలల తరబడి ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు గంటల్లోనే మరమ్మతులు చేస్తున్నారని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లు, బైక్‌ రైడర్లు, స్కూల్‌ బస్సు నిర్వాహకులు ప్రత్యేకంగా ఈ సేవలను ప్రశంసిస్తున్నారు. సోషల్‌ మీడియాలో కూడా రోడ్‌ డాక్టర్‌ వీడియోలు వైరల్‌ అవుతూ కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నాయి. గుంతలు లేని రోడ్లు, సురక్షితమైన ప్రయాణం లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ రోడ్‌ డాక్టర్‌ సేవలు భవిష్యత్తులో మరిన్ని నగరాలకు దిక్సూచిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి

ఆక్సిజన్‌ ఏం చేస్తున్నారు..?

దులీప్ ట్రోఫీ: నార్త్ జోన్ కెప్టెన్‌గా కన్హయ్య వాధ్వాన్.. అర్ష్‌దీప్ సింగ్‌కు ఛాన్స్

Updated Date - Aug 04 , 2026 | 09:12 AM