Share News

‘సిట్‌’ అదుపులో ఈశ్వర్‌ కిరణ్‌

ABN , Publish Date - Aug 04 , 2026 | 09:22 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక నిందితుడు, మద్యం ముడుపుల వసూళ్ల నెట్‌వర్క్‌కు నాయకత్వం వహించిన ఈశ్వర్‌ కిరణ్‌ కుమార్‌రెడ్డి(ఏ9) ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగిపోయాడు.

‘సిట్‌’ అదుపులో ఈశ్వర్‌ కిరణ్‌
AP Liquor Scam

  • లిక్కర్‌ స్కామ్‌లో కీలక నిందితుడు, రాజ్‌ కసిరెడ్డి అనుచరుడు

  • మద్యం ముడుపుల వసూళ్ల నెట్‌వర్క్‌కు నాయకత్వం

  • సుప్రీం బెయిల్‌ నిరాకరణతో కొలంబో నుంచి హైదరాబాద్‌కు

  • ఎల్‌వోసీ ఉండటంతో సిట్‌కు ఇమిగ్రేషన్‌ అధికారుల సమాచారం

  • నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం

  • ‘లొంగుబాట’లో మరో నిందితుడు సైఫ్‌ అహ్మద్‌!

అమరావతి (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక నిందితుడు, మద్యం ముడుపుల వసూళ్ల నెట్‌వర్క్‌కు నాయకత్వం వహించిన ఈశ్వర్‌ కిరణ్‌ కుమార్‌రెడ్డి(ఏ9) ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగిపోయాడు! రెండేళ్లుగా విదేశాల్లో దాక్కున్న కిరణ్‌కు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో అతను స్వదేశానికి చేరుకున్నాడు. శ్రీలంకలోని కొలంబో నుంచి విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన కిరణ్‌ కుమార్‌రెడ్డిపై ఇప్పటికే ఎల్‌వోసీ ఉండడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ అధికారులు ఆపేశారు.


వారిచ్చిన సమాచారంతో సిట్‌ అధికారులు సోమవారం శంషాబాద్‌కు వెళ్లి కిరణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు తీసుకువచ్చి మంగళవారం ఇక్కడి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. రాజ్‌ కసిరెడ్డితో కలిసి మద్యం కుంభకోణంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన కిరణ్‌ కుమార్‌రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే విదేశాలకు పారిపోయాడు. డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి లంచాలు వసూలు చేసేందుకు రాజ్‌ కసిరెడ్డి ఏర్పాటు చేసుకున్న నెట్‌వర్క్‌ మొత్తాన్ని కిరణ్‌ నడిపించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే తేల్చింది. ఇప్పుడు అతన్ని విచారించడం ద్వారా అంతిమ లబ్ధిదారు వాటా తేలే అవకాశం కనిపిస్తోంది.


నగదు రూపంలో మద్యం ముడుపులు తీసుకుని.. వైసీపీ లిక్కర్‌ ముఠాలోని సభ్యులకు వాటాలు చేర్చడం నుంచి విదేశాల్లో పెట్టుబడులు పెట్టే వరకూ ప్రతి అడుగులో కీలకంగా వ్యవహరించిన కిరణ్‌ను అరెస్టు చేసేందుకు సిట్‌ అధికారులు ఏడాదికి పైగా ప్రయత్నిస్తున్నారు. సిట్‌ అధికారులు ఎల్‌వోసీ జారీచేయడంతో నిందితుడు బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అతడిని కస్టడీకి తీసుకుని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. సిట్‌ ముందు లొంగిపోయి విచారణకు సహకరించాలని, ఆ తర్వాత కింది కోర్టులో రెగ్యులర్‌ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని సీజేఐ ధర్మాసనం సూచించింది. అయితే బెయిల్‌ను వ్యతిరేకించే హక్కు కూడా దర్యాప్తు అధికారులకు ఉంటుందని స్పష్టం చేసింది.


భారత్‌కు వస్తోన్న సైఫ్‌ అహ్మద్‌!

మరో కీలక నిందితుడు కిరణ్‌ చిన్ననాటి స్నేహితుడు, శ్రీకాళహస్తికి చెందిన సైఫ్‌ అహ్మద్‌ కూడా సిట్‌ ముందు లొంగిపోయేందుకు భారత్‌కు వస్తున్నట్లు తెలిసింది. ఆయనకు కూడా సుప్రీంకోర్టు బెయిల్‌ నిరాకరించిన విషయం తెలిసిందే.

మద్యం కేసులో ముగ్గురికి రిమాండ్‌ పొడిగింపు

వైసీపీ హయాంలో మద్యం రవాణా టెండర్లలో జరిగిన అక్రమాల కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 17 వరకు పొడిగించింది. ఈ కేసులో బేవరేజస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో ఉన్నారు.


ఇవి కూడా చదవండి

ఆక్సిజన్‌ ఏం చేస్తున్నారు..?

జగన్‌ డైరెక్షన్‌లోనే ఆటవిక చర్యలు

Updated Date - Aug 04 , 2026 | 09:22 AM