శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. రైలు ఢీకొని నలుగురి మృతి
ABN , Publish Date - Sep 23 , 2026 | 02:46 PM
శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి పరిధిలో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
శ్రీకాకుళం, సెప్టెంబర్ 23: జిల్లాలోని టెక్కలి పరిధిలో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా టెక్కలి స్థానిక ఎస్సీ సోషల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్‌కు చెందిన విద్యార్థులుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు.. రైల్వే భద్రతా బలగాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఒకేసారి నలుగురు విద్యార్థుల మరణంతో టెక్కలి ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రమాదానికి గురైన విద్యార్థులను విశాఖరావు, దిలీప్, శరత్, శివలుగా పోలీసులు నిర్ధారించారు. వీరంతా ట్రాక్‌ను దాటే క్రమంలో ఒకవైపు నుంచి వస్తున్న రైలును గమనించకపోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే బాధిత కుటుంబసభ్యులు.. స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల పూర్తి వివరాలపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు
శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో రైలు ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో విశాఖరావు, దిలీప్‌కుమార్, శివ, శరత్‌కుమార్ మృతి చెందడం అత్యంత విషాదకరమని సీఎం పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైలు రాకను గమనించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఘటనలో సాల్మన్‌రాజ్ అనే మరో విద్యార్థి గాయపడగా.. ప్రస్తుతం టెక్కలి డీహెచ్‌లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. సాల్మన్‌రాజ్‌కు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని.. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
ఇవీ చదవండి:
హానికర ఉత్పత్తుల ప్రచారంపై రాష్ట్రపతి ముర్ము కీలక వ్యాఖ్యలు
ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ